నేటితో పార్లమెంటు సమావేశాలు ముగియబోతున్నాయి. సమావేశాలు మొదలైన రోజు నుంచే నోట్ల రద్దుపై అధికార ప్రతిపక్షాల మద్య తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలతో సాగుతూ నిరర్ధకంగా సాగింది. ఈ సమావేశాలలో దేశానికి, ప్రజలకి మేలు చేకూర్చే ఒక్క విషయంపై కూడా చర్చ జరుగలేదు. పార్లమెంటు ఉభయసభలలో జరుగుతున్న తీరు చూసి సీనియర్ పార్లమెంటేరియన్ లాల్ కృష్ణ అద్వానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సభా కార్యక్రమాలకి అడ్డుపడుతున్న వారిని సభ నుంచి సస్పెండ్ చేసి వారి జీతాలలో కోత విదించాలని కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎవరు ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా పార్లమెంటు సభ్యుల తీరు మారలేదు.
నోట్ల రద్దుపై చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని తాము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వారు దానికే కట్టుబడి ఉండి ఉంటే, మోడీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే అవకాశం ఉండేది. కానీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డారని నిరూపించేందుకు తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, తనను లోక్ సభ లో మాట్లాడనిస్తే వాటిని బయటపెడతానని బెదిరింపులకి పాల్పడటం ద్వారా అజెండాని పక్కదారి పట్టించినట్లయింది. రాహుల్ గాంధీ తనని సభలో మాట్లాడనీయడంలేదని చెప్పడం సిగ్గు చేటు. ఆయన గతంలో చాలాసార్లు సభలో సుదీర్గ ప్రసంగాలు చేసిన సంగతి మరిచిపోయి, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అధికార పార్టీ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా తనను సభలో మాట్లడనీయడం లేదని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అధికార, ప్రతిపక్షాల సభ్యులు అందరూ ప్రజలు పడుతున్న కష్టాలు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మొసలి కన్నీళ్ళు కార్చుతూ ఒకరినొకరు నిందించుకొంటూ అందరూ కలిసి పార్లమెంటు సమావేశాలు జరుగకుండా చేశారు. రాష్ట్రపతి హెచ్చరించినా కూడా వారిలో మార్పు కలుగలేదు. నిరర్ధకమైన ఆ సమావేశాల వలన కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది తప్ప దేశానికి, ప్రజలకి ఏమీ మేలు కలుగలేదు. కనుక నేటితో అవి ముగుస్తునందుకు సంతోషించవచ్చు.