పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు ‘అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే పెట్టాను’ అనే ట్యాగ్ లైన్ దానికి ఇచ్చి, ఆ తరువాత ప్రశ్నించకపోవడంతో అందరూ ఆయననే ‘ఎందుకు ప్రశ్నించడం లేదు?’ అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ వారి ప్రశ్నలకి జవాబులు చెప్పేవారు కాదు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు రెండూ తనకి రెండు కళ్ళవంటివని చెప్పుకొనే పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకానేక సమస్యలు ఎదురైనప్పటికీ చాలా అరుదుగా ప్రశ్నించేవారు.
కానీ ప్రత్యేక హోదాపై పోరాటం మొదలుపెట్టిన తరువాత భాజపాని (కేంద్రప్రభుత్వాన్ని) గట్టిగానే ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాస్తవానికి తెదేపాని కూడా అదే స్థాయిలో ప్రశ్నించవలసి అనేక సమస్యలున్నప్పటికీ, ఎందుకో దానిపట్ల పవన్ కళ్యాణ్ కొంచెం మెతక వైఖరి అవలంభిస్తుంటారు. దానికి లైట్ గా చురకలతో సరిపెడుతుంటారు. బహుశః అందుకే తెదేపా కూడా వాటిని లైట్ గానే తీసుకొంటోందని చెప్పవచ్చు.
భాజపాకి దూరం జరుగుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా స్పష్టమైన సూచనలు ఇచ్చేశారు కనుక ఇక భాజపాని (కేంద్రప్రభుత్వాన్ని) మొహమాటం లేకుండా విమర్శించేస్తున్నారు. ఈ రోజు మళ్ళీ షూటింగులో గ్యాప్ వచ్చిందో ఏమో అకస్మాత్తుగా భాజపాకి 5 ప్రశ్నలు ట్వీట్టర్ లో సంధించేశారు. తను గత ఎన్నికలలో భాజపాకి రెండు తెలుగు రాష్ట్రాలతో బాటు కర్నాటకలో కూడా ప్రచారం చేసి మద్దతు ఇచ్చానని ముందుగా గుర్తు చేసి మరీ తన 5 ప్రశ్నలని సంధించేరు. వాటిపై తను చాలా మంది మేదావులతో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, చివరికి భాజపాకి ఓటేసిన ప్రజలతో కూడా చాలా లోతుగా చర్చించానని చెప్పారు. కనుక ఇక నుంచి వాటిలో రోజుకొకటి చొప్పున తీసుకొని భాజపాని ప్రశ్నిస్తుంటానని డిక్లేర్ చేసేశారు కూడా. ఇంతకీ ఆ ‘పంచ అంశాలు’ ఏమిటంటే,
1. గోవధ నిషేధం, 2. రోహిత్ వేముల, 3. దేశభక్తి, 4. నోట్ల రద్దు, 5. ఏపికి ప్రత్యేక హోదా.
ఈరోజు గోవధ గురించి భాజపాకి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సందించారు. అవేమిటంటే,
భాజపా గోవధపై ద్వంద వైఖరి ఎందుకు అవలంభిస్తోంది? గోమాంసం తినే వారిలో భయాందోళనలని సృష్టింది. అదే సమయంలో ఆవులను దైవంగా పూజించే వారి దగ్గర గోవధ నిషేధం గురించి మాట్లాడుతూ వారిలో సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది విభజించి పాలించే రాజకీయాలు కావా?
ఒకవేళ భాజపాకి నిజంగానే గోవధ వద్దనుకొన్నట్లయితే తమ పార్టీయే అధికారంలో ఉన్న గోవాలో బీఫ్ ని ఎందుకు నిషేధించలేదు?
గోవధ గురించి మాట్లాడుతున్న భాజపా తన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు తోలు చెప్పులు, బెల్టులు మొదలైనవి ధరించకుండా ఎందుకు నిషేధించలేదు?
భాజపాకి నిజంగానే ఆవులని కాపాడాలనుకొన్నట్లయితే తమ పార్టీలో ప్రతీ ఒక్కరు ఒక ఆవుని దత్తత తీసుకోవడం తప్పనిసరి చేయవచ్చు కదా?
గోవధ నిషేధంపై భాజపాకి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకి కూడా బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుంది కదా?