ఈరోజు జరిగిన బి.ఎ.సి. సమావేశంలో శాసనసభ సమావేశాల షెడ్యూల్, అజెండా ఖరారు చేశారు. ఈ నెల 30 వరకు, మళ్ళీ అవసరమైతే జనవరి 2నుంచి మరొక వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాని కోసం మళ్ళీ మరొకమారు బి.ఎ.సి. సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 20 పని దినాలు ఉండేలా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈనెల 18 (ఆదివారం), 24,25తేదీలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా శాసనసభకి శలవులుగా నిర్ణయించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. రేపే నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనసభలో చర్చిస్తారు. రైతుల రుణమాఫీ, విద్యార్ధుల ఫీజ్ రీఇంబర్స్ మెంట్ వగైరా అంశాలపై సభలో చర్చించాలని నిర్ణయించారు.
నోట్ల రద్దు అంశంపై సభలో చర్చించాలని కాంగ్రెస్, మజ్లీస్ ప్రతినిధులు కోరినప్పుడు సమావేశానికి హాజరైన వారి మద్య ఒక ఆసక్తికరమైన వాదన జరిగింది. కేంద్రంలో పరిధిలో ఉన్న ఆ అంశంపై శాసనసభలో చర్చించడం అవసరమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించగా, అవసరం లేదని భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమర్ధించారు. దానిపై పార్లమెంటులో చర్చించడానికి బయపడి పారిపోయిన కాంగ్రెస్ ఇక్కడ శాసనసభలో చర్చించాలని ఎందుకు డిమాండ్ చేస్తోంది? అని కిషన్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే నోట్ల రద్దు గురించి కాకుండా దాని వలన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి మాత్రమే చర్చిద్దామని ప్రతిపక్షాలు చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అంగీకరించారు. ఈ బి.ఎ.సి. సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల్ ఈశ్వర్, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, అక్బరుద్దీన్ సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు.