మా డబ్బు మాకివ్వండి మహాప్రభో!

నోట్ల కష్టాలతో ప్రజలలో క్రమంగా అసహనం, ఆగ్రహం పెరుగుతోంది. వారిప్పుడు కూరలో..పప్పులో..బియ్యమో కావాలని అడగడం లేదు అవి కొనుక్కోవడానికి తమ ఖాతాలలో దాచుకొన్న డబ్బుని ఇవ్వాలని అడుగుతున్నారు. రోజువారి కూలీలు చేసుకొనేవారు తమకి నగదు రూపంలోనే కూలి చెల్లించాలని కోరుతున్నారు. మన దేశంలో ఇటువంటి డిమాండ్లు కూడా వినవలసి వస్తుందని, దాని కోసం ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తారని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. 

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సి.ఐ.టి.యు. అధ్వర్యంలో మానవహారాలు నిర్వహించి నోట్ల రద్దు, దాని పర్యవసనాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సూర్యాపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్. సుధా భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ, “కర్మాగారాలలో పని చేస్తున్న కార్మికులకి వారి జీతాలు నగదు రూపంలోనే ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి కూడా జీతాలు నగదు రూపంలోనే ఇవ్వాలి. నోట్ల రద్దు చేసి నల్లధనం వెలికి తీస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, ఈవిధంగా సామాన్య ప్రజలని జీవితాలు దుర్బరంగా మార్చేశారు. నల్లధనం పోగేసుకొన్నవారు నేటికీ దానిని సులువుగా మార్చేసుకొని పట్టుకుపోతుంటే, సామాన్య ప్రజలు రూ.2,000 కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు,” అని అన్నారు.

“కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి, కార్మికు;ల జీవితాలతో చెలగాటం ఆడుకొంటున్నాయని” కామారెడ్డి జిల్లా సి.ఐ.టి.యు.అధ్యక్షుడు సిద్దిరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సి.ఐ.టి.యు. అద్వర్యంలో నిన్న సూర్యాపేట, నాగారం మండల కేంద్రంలో సిండికేట్ బ్యాంక్ వద్ద, ఖమ్మం జిల్లాలో కాల్వొడ్డు జంక్షన్ వద్ద, మహబూబా బాద్ జిల్లాలో బయ్యారం మండల కేంద్రం, వరంగల్ రూరల్, నర్సంపేట, పరకాల, యాదాద్రి జిల్లాలో భువనగిరి జిల్లా కేంద్రం వద్ద, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, ఇంకా రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన మానవహారాలలో ప్రజలు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. 

సి.ఐ.టి.యు. అధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి కనుక వాటిని పెద్దగా పట్టించుకొనవసరం లేదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే అది పొరపాటే. చాలా చోట్ల ఈ నోట్ల కష్టాలు భరించలేని ప్రజలు స్వచ్చందంగా వచ్చి వాటిలో పాల్గొని తమ నిరసనలు తెలియజేశారు. దానిని తొలి ప్రమాద హెచ్చరికగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావించి యుద్ద ప్రాతిపదికన ఈ నోట్ల కష్టాలని తీర్చవలసి ఉంటుంది. లేదా అందుకు ప్రత్యామ్నాయం చూపడం చాలా మంచిది. నగదు రహిత లావాదేవీలు మాత్రం ఈ సమస్యకి సరైన ప్రత్యామ్నాయం కాదని అర్ధమవుతూనే ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యని అధిగమించడానికి అత్యవసరంగా ప్రత్యామ్నాయ మార్గాలని కనుగొనక తప్పదు. లేకుంటే మున్ముందు ఈ సమస్య ఇంకా తీవ్రమైతే అప్పుడు పరుగులు తీయక తప్పదు.