రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. శాసనసభ, మండలిలో చర్చించవలసిన అంశాలు, సమావేశాల షెడ్యూల్ ఖరారు చేయడానికి బిజినెస్ అడ్వైజరీ కమిటీ నేడు సమావేశం కాబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకి స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగబోతోంది. ఈసారి సమావేశాలని 10 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే, కనీసం రెండుమూడు వారాలైనా నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈరోజు కమిటీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొని ఈ అంశాలన్నీ చర్చిస్తారు.
సహజంగానే దానిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. కనుక సమావేశం ముగిసిన వెంటనే ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చి తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేయడంతో అధికార, ప్రతిపక్షాల మద్య యుద్ధం మొదలవపోతోంది.
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి శాసనసభ సమావేశాలలో తెరాస సర్కార్ పట్ల చాలా మెతక వైఖరి అవలంభిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు భావిస్తుండటంతో ఈసారి ఆయనని ‘పెద్దమనిషి పాత్ర’కే పరిమితం చేసి కూర్చోబెట్టి, తామే ఒక్కొక్కరూ ఒక్కో అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని వ్యూహం సిద్దం చేసుకొన్నామని చెపుతున్నారు. తెదేపా తరపున రేవంత్ రెడ్డి యధాప్రకారం శాసనసభలో చెలరేగిపోవచ్చు కనుక ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి బయటకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని భావించవచ్చు. ఇక డిల్లీ స్థాయిలో తెరాస, భాజపాల మధ్య మంచి అనుబంధమే కొనసాగుతున్నప్పటికీ దానికి ఇంకా అధికార ముద్ర (పొత్తుల ప్రకటన) పడలేదు కనుక డా. లక్ష్మణ్ తదితరులు కూడా ఈ సమావేశాలలో తెరాస సర్కార్ పై యధాప్రకారం విమర్శలు గుప్పించడం ఖాయం.
ఈ సమావేశాలలో అర్ధవంతమైన చర్చలు జరగాలని తెరాస సర్కార్ తో సహా ప్రతిపక్షాలు కూడా కోరుకొంటున్నాయి కానీ ప్రతిపక్షాల మాటలు, వ్యూహాలు చూస్తుంటే ఆవిధంగా జరిగే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు. అయినా తినబోతూ గారెల రుచి ఎలాగుంది? అని అడగడం దేనికి? ఈ సమావేశాలు ఎలాగ జరుగబోతున్నాయో మరికొన్ని గంటలలోనే ఎలాగూ స్పష్టం అయిపోతుంది కదా!