హైదరాబాద్ నుంచి శేఖర్ రెడ్డికి డబ్బు సరఫరా?

ఇటీవల చెన్నైలో శేఖర్ రెడ్డి, అతని భాగస్వాముల దగ్గర పట్టుబడ్డ రూ.170 కోట్లు విలువగల కొత్త నోట్లు, వాటిపై ఉన్న సంఖ్యల ఆధారంగా అవన్నీ ఆంధ్రాలో వైజాగ్ నుంచి, తెలంగాణా లో హైదరాబాద్ నుంచి వచ్చినట్లు ఈడి అధికారులు కనుగొన్నారు. దానిలో ఎక్కువ భాగం వైజాగ్ లోని వివిధ జాతీయ బ్యాంకుల నుంచే మార్చుకొని తీసుకువెళ్ళినట్లు కనుగొన్నారు.

శేఖర్ రెడ్డికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో స్నేహసంబందాలున్నాయని కాంగ్రెస్, వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ అతను, అతని భాగస్వాములు ఆంధ్రాలో ఒకే ఊరు (వైజాగ్) నుంచి అంత బారీగా నల్లధనం మార్చుకోగలిగారంటే, ఎటువంటి పలుకుబడి లేకుండా అది సాధ్యం కాదని వేరే చెప్పనవసరం లేదు.

రెండు రాష్ట్రాలలో వివిధ బ్యాంకులకి చెందిన మొత్తం 10 మంది ఉన్నతాధికారులు ఈ బారీ కుంభకోణంలో శేఖర్ రెడ్డికి సహకరించినట్లు ఈడి ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఇంకా ఎంత మంది అధికారులు, రాజకీయ నేతలున్నారో? అంత బారీ డీల్ చేసినవారి పేర్లను బయటపెట్టడం బహుశః ఎవరి తరమూ కాకపోవచ్చు. కొన్ని రోజుల తరువాత ఈ వ్యవహారం మెల్లగా అటకెక్కిపోవడం తధ్యం.