నోట్ల రద్దుపై భాజపా ఎమ్మెల్యే అసంతృప్తి!

 నోట్ల రద్దు, దాని పర్యవసానాలపై దేశంలో ప్రతిపక్షాలు బహిరంగంగానే మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. భాజపా, దాని మిత్రపక్షాల నేతలలో కూడా అసంతృప్తి ఉన్నప్పటికీ వారు దానిని బయటపెట్టుకోలేకపోతున్నారు. నోట్ల రద్దు క్రెడిట్ తనదేనన్న ఏపి సిఎం చంద్రబాబు కూడా అప్పుడప్పుడు ఈ సమస్యలని చూసి సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. 

భాజపా విశాఖ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకి కూడా బ్యాంక్ దగ్గర చేదు అనుభవం ఎదురవడంతో, ఆయనకి కూడా బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నిలబడుతున్న సామాన్య ప్రజలు కష్టాలు అర్ధం అయినట్లున్నాయి. అందుకే సుతిమెత్తగా కేంద్రంపై విమర్శలు చేశారు. 

“నేను మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను కానీ దాని అమలులో జరుగుతున్న లోపాల వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు తప్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ తగినన్ని నోట్లని ప్రత్యేక విమానాలలో పంపించాలి. కొందరు బ్యాంక్ సిబ్బంది సహాయంతో లక్షలు, కోట్లు పట్టుకుపోతున్నారని టీవీ ఛానల్స్ లో, న్యూస్ పేపర్లలో వార్తలు చూస్తున్నాము. అటువంటి వారిపై కేంద్రప్రభుత్వం కటినమైన చర్యలు తీసుకొని బ్యాంకులలో జరుగుతున్న అక్రమాలకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాను.” 

“చంద్రబాబు ఈరోజు సహనం కోల్పోయానని చెపుతున్నారు కానీ నేను 4 రోజుల క్రితమే కోల్పోయాను. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకు రమ్మని మనిషిని పంపితే రూ.6,000 మాత్రమే పట్టుకు వచ్చాడు. మళ్ళీ నేను మేనేజర్ కి ఫోన్ చేసి మాట్లాడితే మరో రూ.10,000 ఇచ్చారు. నాకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? కనుక రిజర్వ్ బ్యాంక్ తక్షణమే అవసరమైనంత డబ్బుని అన్ని బ్యాంకులకి పంపించాలి,” అని అన్నారు. 

భాజపా ఎమ్మెల్యే బ్యాంక్ కి రాకపోయినా కోరినంతా డబ్బు దొరకలేదని అసహనం కలిగిందని చెపుతున్నారు. మరి రూ.2,000ల కోసం ప్రజలు తమ పనులన్నీ మానుకొని రోజూ గంటల తరబడి బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నిలబడిన తరువాత ఆ చిన్న మొత్తం కూడా దొరకనప్పుడు వారు ఎంత ఆగ్రహం, అసహనం చెందుతారో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అర్ధం చేసుకొంటే మంచిది కదా!