రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తరువాత మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో తన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఈరోజు సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్లకి అనేక ముఖ్యమైన సూచనలు, సలహాలు, మార్గదర్శకాలు ఇచ్చారు. ఆయన చెప్పిన వాటిలో ముఖ్యమైనవి కొన్ని విషయాలు:
1. ప్రస్తుతం రాష్ట్రం ఏవిధంగా ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీ పడి ముందుకు దూసుకుపోతోందో, అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాలు కూడా అభివృద్ధిలో ఒకదానితో మరొకటి పోటీ పడాలి.
2. ప్రభుత్వం అంటే డబ్బు, అనుమతులు మంజూరు చేసే సంస్థ అనే అభిప్రాయాన్ని తొలగించి, ప్రజల జీవితాలలో మంచి మార్పులకి కృషి చేసేదనే గుర్తింపు రావాలి. జిల్లా స్థాయిలో అధికారులు, కలెక్టర్లు అందుకు ఇంకా కృషి చేయాలి. ఏదో మొక్కుబడిగా పధకాలు రూపొందించకుండా, రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పాలసీలు, పధకాలు తయారు చేసుకొంటూ ముందుకు సాగాలి.
3. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే కాకుండా గ్రామీణ ప్రజలకి ఉపాధి కల్పించి వారిని దుర్వ్యసనాల నుంచి దూరం చేయగలిగాము. గ్రామాలలో పేకాట, గుడుంబా తయారీ వంటి దురలవాట్లని వదిలించగలిగాము. వారందరికీ ఉపాధి మార్గాలు చూపించవలసిన భాద్యత జిల్లా కలెక్టర్లదే.
4. అలాగే టి.ఎస్-ఐ పాస్ ద్వారా రాష్ట్రంలో కొత్తగా 2500 పరిశ్రమలు వచ్చాయి. వాటితో అనేకమందికి ఉద్యోగాలు వచ్చాయి. జిల్లా స్థాయిలో కూడా ప్రజలకి మేలు చేసే అటువంటి పధకాలని రూపొందించుకోవాలి.
5. అత్యవసర పనుల కోసం ఒక్కో జిల్లా కలెక్టర్ కి రూ.3 కోట్లు చొప్పున 31 జిల్లాలకి కలిపి మొత్తం రూ. 93 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారు.
6. ఉపాద్యాయులు, వివిధ శాఖలలో ఉద్యోగుల సహాయంతో ప్రజలకి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించి, తమతమ జిల్లాలని నగదు రహిత జిల్లాలుగా మార్చుకొనేందుకు కృషి చేయాలని కోరారు.