తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. “తెరాస సర్కార్ ఒక నయీంని ఖతం చేసింది కానీ అనేకమందికి జన్మనిచ్చింది. నయీం కేసులో సిట్ దర్యాప్తు అకస్మాత్తుగా ఎందుకు చల్లబడిపోయింది? ఇన్ని రోజులలో ఒక్క వ్యక్తి మీద కూడా ఎందుకు కేసు నమోదు చేయలేదు? నయీం అక్రమగా కూడబెట్టిన వందల కోట్ల విలువగల డబ్బు, ఆస్తులన్నీ ఏమైపోయాయి? నయీంతో సంబంధం ఉన్న తెరాస నేతలపై, అతని బినామీలపై తెరాస సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు.
మళ్ళీ ఆ ప్రశ్నకి జవాబు కూడా రాజగోపాల్ రెడ్డే చెప్పారు. నయీంతో సంబంధాలున్న తెరాస నేతలపై చర్యలు తీసుకొంటే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే భయంతోనే ఇంతవరకు ఎవరిమీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ప్రభుత్వంలో మంత్రుల పాత్రపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి వంటి కొందరు మంత్రులు ప్రభుత్వంలో డమ్మీ మంత్రులుగానే వ్యవహరిస్తున్నారని, వారు కేవలం శంఖుస్థాపనలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. నయీం భాదితులకి న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తెరాస సర్కార్ తో పోరాడుతూనే ఉంటుందని, అవసరమైతే దాని కోసం భాదితులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.