మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం మళ్ళీ చాలా రోజుల తరువాత ఈరోజు మీడియా ముందుకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర విమర్శలు చేశారు. వారికి అనేక ప్రశ్నలు సందించి సమాధానాలు కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఒక బారీ ప్రకృతి విపత్తు దేశం మీద విరుచుకు పడినా కూడా ప్రజలు ఇంత ఇబ్బంది పడి ఉండరు. నోట్ల రద్దు అనేది ఈ ఏడాదిలోకెల్లా అతిపెద్ద కుంభకోణం. దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నాను. నల్లధనం వెలికి తీయడానికే ఈ నిర్ణయం అని ప్రభుత్వం చెపుతున్నప్పుడు, మరో వందల కోట్లు విలువ గల కొత్త నోట్లు నల్లధనంగా మారిపోతుంటే చూస్తూ ఎందుకు ఊరుకొంది. ఒకవైపు సామాన్య ప్రజలకి రూ.2000 దొరక్క నానా కష్టాలు పడుతుంటే వందల కోట్లు కొత్త నోట్లు కొంతమందికి ఎలా చేరుతున్నాయి? ఇది కుంభకోణం కాదా?” అని ప్రశ్నించారు.
1. ఇది ఒక అతిపెద్ద ప్రకృతి విపత్తు కంటే చాలా ఎక్కువగా దేశానికి నష్టం కలిగించింది.
2. బాగా డబ్బు ఉన్నవారు యధా ప్రకారం చాల హాయిగానే జీవితం గడుపుతున్నారు. కానీ సామాన్య ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు, రైతులు, రోజువారి కూలీలు తదితరుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ వారిని చావు దెబ్బ తీశారు.
3. ఈశాన్య రాష్ట్రాలలో బ్యాంకులలో, ఎటిఎంలలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా లేకపోవడంత్ అక్కడ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.
4. మొదట నల్లధనం వెలికి తీయడానికే ఈ నిర్ణయం అని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు మాట మార్చి నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడానికే ఆ నిర్ణయం తీసుకొన్నామని చెపుతున్నారు. సింగపూర్, అమెరికా వంటి అభివృద్ధి చెందన దేశాలలో సైతం నేటికీ నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. అసలు ప్రపంచంలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న దేశాలు ఎన్ని ఉన్నాయి? మోడీ, జైట్లీ చెప్పగలరా? అభివృద్ధి చెందిన ఆ దేశాలు అమలు చేయలేనప్పుడు నిరక్షరాస్యులు, నిరుపేదలు ఎక్కువగా ఉన్న మనదేశంలో కొన్ని నెలల వ్యవధిలో నగదు రహిత విధానాన్ని అమలుచేయడం సాధ్యమేనా?
5. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు గురించి మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన ప్రసంగంలో 18 సార్లు నల్లధనం వెలికి తీయడం గురించి మాట్లాడారు. మళ్ళీ నవంబర్ 27న చేసిన ప్రసంగంలో 8సార్లు నల్లధనం గురించి మాట్లాడితే, ఏకంగా 27సార్లు నగదు రహిత లావాదేవీల గురించి మాట్లాడారు. అంటే ఆయన మాట మార్చుతున్నట్లు స్పష్టం అవుతోంది.
6. నోట్ల రద్దు నిర్ణయం ఒక అనాలోచిత, అర్ధ రహితమైన నిర్ణయం. దీనితో దేశంలోని కోట్లాది మంది సామాన్య ప్రజలని శిక్షిస్తున్నట్లుంది తప్ప వారికి మేలు చేయడం లేదు. డబ్బు కోసం క్యూ లైన్లలో నిలబడి చాల మంది చనిపోయారు. కేంద్రప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత తొందరపాటు నిర్ణయం కారణంగానే వారు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం కాదా? దానికి కేంద్రప్రభుత్వం భాద్యత వహించదా? అని చిదంబరం ప్రశ్నించారు.