ఫిబ్రవరి 2013లో దిల్ సుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబు ప్రేలుళ్ళ కేసుని విచారిస్తున్న ఎన్.ఐ.ఎ. ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం దానికి బాధ్యులైన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. ఆ కేసులో నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉండగా, ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల అదుపులో ఉన్న ఆ నలుగురిని నేడు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారిపై దేశద్రోహం, హత్య నేరం, కుట్ర, ప్రేలుడు పదార్ధాల చట్టం ఉల్లంఘన క్రింద కేసులు నమోదు చేశారు. వారందరికీ ఈ నెల 19న శిక్షలు ఖరారు చేస్తామని ఎన్.ఐ.ఎ.ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు ప్రకటించింది.
దిల్ సుఖ్ నగర్ వద్ద గల కోణార్క్ థియేటర్ వద్ద మొదట బాంబు ప్రేలుడు జరిగింది. మళ్ళీ కొద్ది నిమిషాల వ్యవధిలోనే వెంకటాద్రి థియేటర్ వద్ద మరో బాంబు ప్రేలుడు జరిగింది. ఈ జంట ప్రేలుళ్ళలో 22 మంది మరణించగా, 144 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్.ఐ.ఎ. బృందం ఈ మూడున్నరేళ్ళలో మొత్తం 524 మందిని విచారించింది. వారిలో 157 మంది సాక్షులుగా కోర్టులో వాగ్మూలం ఇచ్చారు. ఈ బాంబు ప్రేలుళ్ళ కేసులో నిందితుల నిర్ధారణ అయిపోయింది కనుక వారికి కోర్టు విదించబోయే శిక్షలని త్వరగానే అమలు చేసే అవకాశం ఉంది. కానీ వారు ఉన్నత న్యాయస్థానంలో దానిని సవాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కనుక ఆ కారణంగా ఆలస్యం జరుగవచ్చు.