మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు రెండవ కుమారుడు పివి రాజేశ్వర రావు (70) నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఆరోగయం విషమించి కన్ను మూశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
పివి రాజేశ్వరావుకి భార్య రాధిక, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన 1946, ఆగస్టు 14న కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించారు. ఆయన 1996లో సికింద్రాబాద్ ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలంగాణా పిసిసి కార్యదర్శిగా పని చేశారు కానీ తన తండ్రిలాగ రాజకీయాలలో పెద్దగా రాణించలేకపోయారు. తండ్రిలాగ సంగీత, సాహిత్య రంగాలలో మంచి పట్టు ఉండేది. వంగర గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకి ప్రతీ ఏటా వెండిబంగారు పతకాలని బహుకరించేవారు. ఆయన ఎక్కువగా డిల్లీ లేదా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ స్వస్థలమైన వంగర గ్రామానికి, అక్కడి ప్రజలకి ఎప్పుడూ దూరం కాలేదు. ఆ కారణంగా ఆ గ్రామా ప్రజలు ఆయనని చాలా అభిమానిస్తారు. కనుక ఆయన అంత్యక్రియలకి వంగర గ్రామం నుంచి కూడా చాలా మంది తరలివస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో గల విష్పర్ వ్యాలీలో గల మహా ప్రస్తానం శ్మశానవాటికలో ఈరోజు మధ్యాహ్నం 3.30గంటలకి ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.