అసెంబ్లీ సమావేశాలకి అందరూ రెడీ

ఈ శుక్రవారం నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలుకాబోతున్నందున అధికార, ప్రతిపక్ష పార్టీలు అందుకు సిద్దం అవుతున్నాయి. ఈ సమావేశాలని నిరర్ధకమైన రాజకీయచర్చా వేదికగా మారకుండా, ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరిగేలా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావుని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలని కోరారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకి సంబంధిత శాఖల మంత్రులు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చేందుకు సిద్దం అయ్యి సమావేశాలకి రావాలని ముఖ్యమంత్రి కోరారు. 

ఇక తెలంగాణాలో తెదేపా అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే తెదేపా అన్నట్లుగా మారినందున, ఈ సమావేశాలలో తెరాస సర్కార్ ని ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయంపై పార్టీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య తదితరులతో నిన్న శాసనసభలో గల పార్టీ కార్యాలయంలో చర్చించారు. చాలా కాలంగా తెదేపాకి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఈ సమావేశానికి హాజరుకావడం ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పవచ్చు. అయితే శాసనసభలో తెదేపా తరపున మాట్లాడే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమేనని అందరికీ తెలుసు. 

తెరాస సర్కార్ ఎదుర్కోవడానికి ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో అంశం లేదా సమస్యపై లోతుగా అధ్యయనం చేసి, దానికి సంబంధించి ప్రశ్నలు అడగడానికి సిద్దం అవుతున్నారు. ఇది కూడా మంచి పరిణామమేనని చెప్పవచ్చు. నీటి పారుదల శాఖకి సంబంధించిన అంశాలని డికె అరుణ, హామీల అమలు గురించి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి...ఇలాగ ఒక్కో అంశంపై ఒక్కొక్కరు తెరాస సర్కార్ ని నిలదీయడానికి సిద్దం అవుతున్నారు. తెరాస సర్కార్ కూడా సభలో ఇటువంటి అర్ధవంతమైన చర్చ జరగాలనే కోరుకొంటోంది కనుక ఈసారి శాసనసభ సమావేశాలు ఏవిధంగా జరుగబోతాయో చూడాల్సిందే.