రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట సిద్ధిపేట నియోజకవర్గాన్ని ఎంచుకొన్న సంగతి తెలిసిందే. సిద్ధిపేటలోని ఇబ్రహీం పూర్ గ్రామం ఆ క్రెడిట్ ని స్వంతం చేసుకొంది. రాష్ట్రంలో మొట్టమొదటి నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్న గ్రామంగా ఇబ్రహీంపూర్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధిపేటని ఈ ప్రయోగానికి ఎంచుకొన్న తరువాత అధికారులు అక్కడ ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్లు తెరిపించి డెబిట్ కార్డులు అందజేసి, గ్రామంలో అన్ని ప్రధాన దుఖాణాలలో స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత నగదు రహిత లావాదేవీలు ఏవిధంగా నిర్వహించాలో ప్రజలకి, వ్యాపారస్తులకి శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి ఇబ్రహీంపూర్ లో ప్రజలు నగదు రహిత లావాదేవీలు చేయడం మొదలుపెట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకొన్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్ని కూడా త్వరలో నగదు రహితంగా చేసేందుకు అధికారులు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 23ని అందుకు ముహూర్తంగా ఎంచుకొన్నారు. ఆరోజున ఆ రెండు గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన గృహాలని ప్రజలకి అందజేయబోతున్నారు. ఆరోజు నుంచే ఆ రెండు గ్రామాలని కూడా నగదు రహితంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
రాష్ట్రంలో పెద్ద పట్టణాలు, హైదరాబాద్ జంట నగరాలలో ఉన్నవారిలో చాల మంది చాలా కాలంగానే నగదు రహిత లావాదేవీలని నిర్వహిస్తున్నారు కనుక అక్కడ దానిని విస్తరించడానికి అధికారులు పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు కానీ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే గ్రామాలలో ఈ విధానం గురించి వారికి వివరించి, దానిని వారు అంగీకరించేలా నచ్చజెప్పి అమలుచేయించడం అధికారులకి కత్తి మీద సాము వంటిదే.
ఒకవైపు గ్రామీణ ప్రజలకి దీని గురించి వివరించి నచ్చజెప్పుకొంటూనే మరో పక్క బ్యాంకుల తరపు నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారితో కూడా నిరంతరం సంప్రదింపులు చేస్తుండాలి. ఈ ప్రయత్నాలలో విజయవంతం అయితే పరువాలేదు లేకుంటే అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. కనుక ఈ విధానాన్ని అమలుచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి వారు చేస్తున్న సూచనలని స్వీకరిస్తూ తదనుగుణంగా విధివిధానాలు రూపొందించుకోవడం మంచిది.