నల్లకుభేరులకి ఇంకా 18 రోజులే గడువు మిగిలింది. డిశంబర్ 30వ తేదీ అర్ధరాత్రితో ఇక పాతనోట్లని మార్చుకోవడం సాధ్యం కాదు. ఎక్కడా చెల్లుబాటు కావు కనుక అన్నీ చిత్తుకాగితాలుగా మారిపోతాయి. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కౌంటర్లలో మార్చి 31 వరకు మార్చుకొనే అవకాశం ఉన్నప్పటికీ, అప్పుడు ప్రతీ పైసాకి లెక్కలు చెప్పవలసి ఉంటుంది. అదే సాద్యమైతే నల్లకుభేరులు అందరూ తమ నల్లధనాన్ని తమ బ్యాంక్ ఖాతాలలోనే జమ చేసుకొనేవారు.
కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవలన్నట్లు డిశంబర్ 30వ తేదీలోగానే నల్లధనం మార్చుకోక తప్పదు. ఆ ప్రయత్నంలోనే అనేకమంది హడావుడిగా తమ వద్ద ఉన్న నల్లదనాన్ని 20-30 కమీషన్ ఇచ్చి కొత్త నోట్లుగా మార్చేసుకొంటున్నారు అయినా దానిని వైట్ గా మార్చుకోవడం మాత్రం సాధ్యం కాదు కనుక గుట్టుగా తమ స్టోరేజి పాయింట్లకి తరలిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకి కూడా నిఘా వర్గాలు, పోలీసులు, ఆదాయపన్ను అధికారులు కలిసి గండి కొడుతున్నారు. రోజూ లక్షల రూపాయల విలువగల కొత్త నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి.
సోమవారం రాజస్తాన్ లోని బికనీర్ లో ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.28లక్షల విలువ గల రూ.2,000 నోట్లు, మరో ఇద్దరి దగ్గర నుంచి రూ.7.52 లక్షలు విలువ గల రూ.2,000 నోట్లు, మిగిలినవి రూ.100 నోట్లు పట్టుకొన్నారు. జైపూర్ లో కూడా ఇవ్వాళ్ళే రూ.93.52 లక్షలు విలువ గల రూ.2,000 నోట్లని పోలీసులు పట్టుకొన్నారు. దానిలో ఆరు లక్షల రూపాయల విలువగల వంద నోట్లు ఉండటం విశేషం.
ఇటీవల చెన్నైలోని శేఖర్ రెడ్డి దగ్గర నుంచి రూ.107 కోట్లు విలువగల రూ.2,000 నోట్లు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇన్ని లక్షలు, కోట్లు విలువగల కొత్త నోట్లు అన్నీ నల్లకుభేరుల లాకర్లలోకే వెళ్ళిపోతున్నందునే రిజర్వ్ బ్యాంక్ ఎన్ని లక్షల కోట్లు విలువగల కొత్త నోట్లు ముద్రిస్తున్నా అవి సామాన్య ప్రజలకి చేరడం లేదు. ఇటువంటివారిని పట్టుకోలేనంత వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆశించిన ప్రయోజనం నెరవేరకపోవచ్చు.