
మంత్రి పదవి కోల్పోవడం చాలా బాధాకరమే. కనుక కొండా దంపుతులలో ఆ బాధ, ఉక్రోషం ఉండటం సహజమే. కానీ ఇన్ని రోజులు మౌనంగా ఉన్నవారు నేడు ఢిల్లీ నుంచి పిలుపు రాగానే మళ్ళీ నోటికి పనిచెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
కొండా సురేఖ మంత్రి పదవి ఊడిన తర్వాత తమ పరిస్థితి ఏవిధంగా మారిందో వారు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. కనుక ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు అంతే హుందాగా స్పందించాలి.
కానీ నేడు అనుచరులతో సమావేశమైన తర్వాత ఇద్దరూ మళ్ళీ ఎప్పటిలాగే సిఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించి పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇప్పటికే చాలాసార్లు తమకు పిలుపులు వచ్చాయి కానీ వెళ్లలేదని గొప్పగా చెప్పుకున్నారు.
గతంలో ఒక నాయకుడుని నమ్ముకుంటే కష్టసుఖాలలో వెన్నంటి ఉండేవారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమని కంటికి రెప్పలా చూసుకునేవారని కానీ ఇప్పుడు పార్టీలో ఎవరినీ నమ్మలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. పార్టీలో వెన్నుపోటు పొడిచేవారు, అధిష్టానానికి చాడీలు చెప్పేవారే ఎక్కువ ఉన్నారన్నారు.
తాను జగన్ కోసం క్షణం ఆలోచించకుండా రాజీనామా చేసి వెళ్తే, అయన ఆంధ్రాకు తరలిపోవడంతో తమ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందన్నారు. అప్పుడు కేసీఆర్ తమని పిలిచి వరంగల్ ఈస్ట్ బాధ్యత అప్పగించారన్నారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మొట్ట మొదట తామే ఆయనకు మద్దతు ఇచ్చామన్నారు. కానీ ఇప్పుడు అయన పంతం వల్లనే తన పదవి పోయిందన్నారు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ వరంగల్ నుంచే పోటీ చేసి గెలిచి మంత్రి పదవి చేపడతానని కొండా సురేఖ అన్నారు.