తెలంగాణ శాసనమండలిలో నేడు ప్రశ్నోత్తరాల సమయంలో దివ్యాంగుల నుంచి పింఛన్ల గురించి సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు.
“అర్హులైన దివ్యాంగుల నుంచి పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 15 తేదీ వరకు గడువు ఉందని కనుక ఆలోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకు దివ్యాంగుల కేటగిరీలో 1,23,199 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,66,351 మంది దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారని మంత్రి తెలిపారు. దరఖాస్తులు పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ తప్పకుండా పింఛన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
సదరం సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల కొందరికి పింఛన్లు అందడం లేదని సీతక్క తెలిపారు. అర్హత ఉన్న వారు తమ సదరం సర్టిఫికెట్లను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈసారి థలసేమియా బాధితులకు పింఛన్లు అందించబోతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు.