ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో శోకిస్తున్న తమిళనాడు ప్రజలకి మరో కష్టం వచ్చిపడుతోంది. అదే..వార్ధా తుఫాను. మొదట ఇది ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అవుతుందని భావిస్తే అది దిశా మార్చుకొని తమిళనాడువైపు మళ్ళింది. దానితో తమిళనాడులో పలుప్రాంతాలు, ముఖ్యంగా రాజధాని చెన్నై నగరానికి మళ్ళీ తుఫాను గండం తప్పలేదు. చెన్నైతో సహా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ఇప్పటికే బారీ వర్షాలు మొదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం తరువాత వార్ధా తుఫాను తీరం దాటి రాష్ట్రంలోకి ప్రవేశించబోతోందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.
జయలలిత స్థానంలో కొత్తగా ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వంకి ఇది కూడా మరో అగ్నిపరీక్ష కాబోతోందని చెప్పవచ్చు. ఈ తుఫాను ప్రభావానికి గురి కాగల చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, విల్లుపురం ప్రాంతాలలో పాఠాశాలలు, కాలేజీలకి ఈరోజు శలవు ప్రకటించారు. వార్ధా తుఫానుని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన చోట ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
గత ఏడాది కూడా డిశంబర్ నెలలోనే నాడా తుఫాను కారణంగా చెన్నైలో బారీ వరదలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వార్ధా తుఫాను చెన్నైని దెబ్బ తీయడానికి వేగంగా దూసుకు వస్తోంది. చెన్నైకి 60కిమీ దూరంలో ఉన్న పులికాట్ వద్ద నుంచి ఈ తుఫాను రాష్ట్రంలోకి ప్రవేశించబోతోంది. గంటకి 110-120 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, 20సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తమిళనాడు, దాని రాజధాని చెన్నైకి వెళ్ళవలసిన అనేక రైళ్ళు, బస్సులు, విమానాలు రద్దు అయ్యాయి. కొన్ని వేరే ప్రాంతాలకి మళ్ళించబడుతున్నాయి. ఇప్పటికే తీవ్ర తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించి వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్మీ, నేవీ, జాతీయ విపత్తుల సహాయ బృందాలు అన్ని ఏర్పాట్లతో తుఫానుని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాయి.
ఈ తుఫాను ప్రభావం ఆంధ్రాలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీరం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంది. ఈ తుఫాను కారణంగా తెలంగాణాలో కూడా కొన్ని ప్రాంతాలలో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది.