పాలకులు మారారు కానీ... కోదండరామ్

తెలంగాణా జేయేసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ తెరాస సర్కార్ పై మళ్ళీ తీవ్ర విమర్శలు చేశారు. “ఆంధ్రా పాలకుల చెర నుంచి తెలంగాణాని విడిపించుకోగలిగాము కానీ వారి స్థానంలో అధికారంలోకి వచ్చిన వారి తీరు మారలేదు. వారు కూడా ఆంధ్రా పాలకులలాగే విద్వంసకర విధానాలని అవలంభిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత అందరికీ రాష్ట్రాభివృద్ధిపై ఒక అవగాహన ఏర్పడింది. కానీ ఆ అభివృద్ధి ఫలాలు ఒకరే అనుభవిస్తున్నారు. అదే ప్రశ్నిస్తే వారికి ఆగ్రహం కలుగుతోంది,” అని ప్రొఫెసర్  కోదండరామ్ విమర్శించారు. 

ఆదివారం ఖమ్మంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా స్థాయి సమావేశం జరిగింది. దానిలో మాట్లాడుతూ ప్రొఫెసర్  కోదండరామ్ ఈ విమర్శలు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే “అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో అందరికీ అందాలి. అందుకే మనం కోట్లాడి తెలంగాణా రాష్ట్రం సాధించుకొన్నామని గుర్తుంచుకోవాలి. ఒక విద్యార్ధి తన సందేహాలని తీర్చుకోవడానికి గురువునే అడుగుతాడు. అందుకు అతనిపై గురువు ఆగ్రహం తెచ్చుకోడు. అలాగే ప్రజా సమస్యలపై మేము అధికారంలో ఉన్నవారినే ప్రశ్నిస్తుంటాము. కానీ మా ప్రశ్నలు పాలకులకి ఆగ్రహం కలిగిస్తున్నాయని అర్ధం అవుతోంది. తెలంగాణా ఏర్పడింది ప్రజల కోసం కానీ ఒక కుటుంబం కోసం కాదు. అటువంటి ఆలోచనలని, ప్రయత్నాలని ప్రజలు ఆమోదించరు. తెలంగాణా అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి దక్కాలి. పాలకులకి ఆగ్రహం కలుగుతున్నా ప్రజలకి అన్యాయం జరుగుతుంటే వారి తరపున నిలబడి మేము ప్రశ్నిస్తూనే ఉంటాము,” అని ప్రొఫెసర్  కోదండరామ్ అన్నారు.