అవును అమ్మ (జయలలిత)లేని లోటుని భర్తీ చేయడానికి ఆమె స్నేహితురాలు శశికళ సిద్దం అయిపోతున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఆమెతో నిన్న సుదీర్గంగా చర్చలు జరిపిన తరువాత ఆమెకి పార్టీ పగ్గాలు అప్పజెప్పడానికి అంగీకరించారు. ఆ విషయం అన్నాడిఎంకె అధికార న్యూస్ ఛానల్ జయా టీవీ ఈరోజు ప్రకటించేసింది. దానిని అన్నాడిఎంకె పార్టీ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టేసి దృవీకరించేసింది. కనుక ఇక కొత్త అమ్మ పట్టాభిషేకం చేసుకోవడం లాంఛనప్రాయమే.
కానీ అసలు కధ అక్కడి నుంచే మొదలవుతుందని చెప్పవచ్చు. పార్టీలో, ప్రభుత్వంలో కూడా తన అనుచరులకి కీలక పదవులు ఇవ్వాలని ఆమె మొదటే షరతు విధించింది. అందుకు పన్నీర్ సెల్వం వర్గం అంగీకరించింది కనుక ఆమె పార్టీ పగ్గాలతో సరిబెట్టుకొన్నారు. లేకుంటే పన్నీర్ సెల్వం కుర్చీ క్రింద మంటపెట్టేసి దింపేసి ఉండేవారే. ఆమె అనుచరులు సెల్వం చెప్పినట్లు వింటారనే నమ్మకం లేదు. అదే విధంగా ఆమెకి కూడా ముఖ్యమంత్రి పదవిపై చాలా ఆశలున్నాయి కనుక తన అనుచరుల ద్వారా పన్నీర్ సెల్వంతో గొడవలు పెట్టుకొని ఆ వంకతో ఆయనని మెల్లగా కుర్చీలో నుంచి దింపేసి దానిలో తను కూర్చోనే ప్రయత్నం చేయడం తధ్యం. ఆమెకి అధికార దాహం లేనట్లయితే, తనకి ఇంత గౌరవం, పరపతి కల్పించిన తన స్నేహితురాలు చనిపోయిన రెండు రోజులకే తనకి పార్టీ పగ్గాలు కావాలని కోరేవారు కారు కదా? కనుక శంకర్ దాదా చెప్పినట్లు పన్నీర్ సెల్వంకి “ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్” తప్పకుండా ఉందని చెప్పవచ్చు.