మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి

నోట్ల రద్దు, నోట్ల కష్టాలు, ఆదాయపన్ను శాఖ దాడులు, నల్లధనం కబుర్లు వగైరా వగైరాలు ప్రస్తుతం దేశంలో చాలా హాట్ టాపిక్స్. జేబులో ఒక్క రూపాయి కూడా లేని వారు సైతం ఇప్పుడు ఈ కోట్ల రూపాయల వ్యవహారాల గురించే మాట్లాడుకొంటున్నారంటే అతిశయోక్తి కాదు. 

దానిపై నుంచి దృష్టి మళ్ళించవలసిన మరో హాట్ టాపిక్ సిద్దం అవుతోంది. అదే...పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరుగవలసిన ఎన్నికల గురించి తాజా కబురు. ఈరోజు కేంద్ర ఎన్నికల కమీషన్ ఆ ఐదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలకి రెడీ అయిపోమని కోరుతూ లేఖలు వ్రాసింది. వాటి గడువు వచ్చే మార్చి నెలలో పూర్తయిపోతుంది కనుక ఫిబ్రవరి నుంచి మార్చ్ నెలలలో ఎన్నికలు నిర్వహించాలనుకొంటున్నామని, కనుక ఆ సమయంలో పిల్లల పరీక్షలు పడకుండా సర్దుబాటు చేసుకోమని ఆ లేఖల ద్వారా కోరింది.    

వాటిలో పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలం మార్చి 18తో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకి మార్చి 26,2 తేదీలలో ముగుస్తుంది. కనుక ఐదు రాష్ట్రాలకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకొంటున్నట్లు ఎన్నికల కమీషన్ తెలిపింది. వాటిలో యూపి తప్ప మిగిలినవన్నీ చిన్న రాష్ట్రాలు అయినందున వాటికి ఒకటి లేదా రెండు దశలో ఎన్నికలు నిర్వహించాలనుకొంటోంది. దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రమైన యూపిలో 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కనుక అక్కడ 5 నుంచి 7 దశలలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.

 ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రాలలో ఉదృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం మొదలుపెట్టేశాయి. ఈ ఎన్నికల కమీషన్ నేడు వ్రాసిన ఈ లేఖలతో ఆ వేడి ఇంకా పెరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో సాధారణ, రైల్వే బడ్జెట్లని ప్రవేశపెట్టడం, వాటి కోసం పార్లమెంటు సమావేశాల నిర్వహణ, ఏకీకృత పన్నువిధానం (జి.ఎస్.టి.) అమలు చేయడానికి అంతిమ సన్నాహాలు చేయడం అన్ని ఒకేసారి వస్తాయి. కనుక ఈ సారి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు దేశంలో చాలా హడావుడిగా ఉంటుంది.