ఆయన వేషం చూస్తే పరమ పవిత్రమైన భక్తుడి వేషం...ఎంచక్కగా సాంప్రదాయం ప్రకారం పట్టుబట్టలు కట్టుకొని, నుదుట నిండుగా పెద్ద నామం పెట్టుకొని చూస్తే దణ్ణం పెట్టాలనిపించేంత పెద్దరికంగా కనిపిస్తాడు. దానికి తగ్గట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడు కూడా. ఆయనే శేఖర్ రెడ్డి. ఇప్పుడు అతని పేరు దేశమంతా మారుమ్రోగి పోతోంది.
చెన్నైలోని అతని ఇంటిపై అదాయ పన్ను శాఖ అధికారులు దాడులలో పెద్దపెద్ద అట్టపెట్టెలు దొరికాయి. దానిలో తిరుపతి లడ్డూలు ఉన్నా ఆశ్చర్యపోతాము కానీ కొత్త 2,000 నోట్ల కట్టలు ఉన్నాయి. వాటి విలువ ఒకటీ రెండూ కాదు...107 కోట్లు!!! అదిగాక అతని ఇంటి ముందు పార్క్ చేసిన మరొక కారులో మరో రూ.27 కోట్లు దొరికాయి. అవి కూడా కొత్త నోట్లే. అతని ఇంటిలో సోదాలు నిర్వహిస్తే బంగారం దొరికింది..ఎంతంటే 127 కేజీలు!!!
అంటే గాలి జనార్ధన రెడ్డి ఆయన ముందు ఎందుకూ పనికి రాడన్న మాట! గాలి అమాయకుడు గాబట్టి బహిరంగంగా ఖనిజాల దోపిడీ చేసి బారీగా ఆస్తులు కూడబెట్టుకోవడమే కాకుండా వాటిని దేశ ప్రజలందరూ చూసేలా ప్రదర్శించుకొని పట్టు బడ్డాడు. కానీ శేఖర్ రెడ్డి మాత్రం కానీ మోడీకే నామం పెట్టేయాలని ప్రయత్నించి పట్టుబడిపోయాడు.
ఇదంతా చెన్నైలోని అతని ఇంటి నుంచి పట్టుబడ్డ నగదు, బంగారం మాత్రమే. ఇంకా స్థిరచారాస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో లెక్కలు తీయవలసి ఉంది. శేఖర్ రెడ్డి యొక్క ఈ గొప్పదనం తెలుసుకొన్న తితిదే అతని బోర్డు సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఒక సామాన్య పౌరుడు రూ.2000 కోసం, వృద్ధులు రూ.1,000 పెన్షన్ కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా వారికి ఆ చిన్న మొత్తం అందడం లేదు. కానీ శేఖర్ రెడ్డి వంటి వారికి రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంకులకి నీటుగా బాక్సులలో ప్యాక్ చేసి వచ్చిన వందల కోట్ల కొత్త నోట్లు వచ్చినవి వచ్చిట్లుగానే తీసుకుపోగలుగుతున్నారంటే ఎవరిని నిందించాలి? ఇటువంటి వారిని చూస్తున్నప్పుడు నోట్ల రద్దుతో నల్లధనం బయటకి వస్తోందా లేకపోతే కేవలం దాని రూపం మార్చుకొంటోందా? అనే అనుమానం కలుగక మానదు. మోడీ దేశాన్ని ఉద్దరిద్దామని ప్రయత్నిస్తుంటే, తమని మార్చడం ఎవరివల్లా కాదని శేఖర్ రెడ్డి వంటివారు నిరూపిస్తున్నారు.