మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అరెస్ట్

భారత మాజీ వైమానిక దళాదిపతి ఎస్.పి.త్యాగిని శుక్రవారం సాయంత్రం డిల్లీలో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ హయంలో జరిగిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఆయనకి బారీగా ముడుపులు తీసుకొన్నారనే ఆరోపణలతో ఆయనని ఈరోజు అరెస్ట్ చేశారు. ఆయనకి కజిన్ బ్రదర్ సంజీవ్ అలియాస్ జూలీ త్యాగి, డిల్లీకి చెందిన గౌతం ఖైతాన్ లను కూడా అదే కేసులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వివిఐపిల ప్రయాణం కొరకు అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ నుంచి రూ.3600 కోట్లు ఖరీదు చేసి 12 హెలికాఫ్టర్లని కొనుగోలు చేయాలనుకొంది. కానీ ఇటలీకి చెందిన ఒక కోర్టు విచారణలో ఆ హెలికాఫ్టర్ల అమ్మకం కోసం అగస్టా ప్రతినిధులు త్యాగితో సహా, అప్పుడు అధికారంలో ఉన్న అనేక మందికి సుమారు రూ. 423 కోట్లు లంచాలు ఇచ్చినట్లు బయటపడటంతో, పార్లమెంటులోపల బయటా యూపియే ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. దానితో జనవరి 1, 2014న ఆ సంస్థతో చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. అప్పుడే సిబిఐ కేసు నమోదు చేసి తీగ లాగితే ఈ డొంక కదలడం మొదలయింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు జరిపించింది. ఆ కుంభకోణంలో ఎవరెవరున్నారు? ఎంతెంత మేసేశారు? ఏవిధంగా దాని చెల్లింపులు జరిగాయి? వంటి వివరాల కోసం ఇటలీ తదితర దేశాల ప్రభుత్వాలకి లేఖలు వ్రాసి బలమైన ఆధారాలు సేకరిస్తోంది. సుమారు రెండేళ్ళ దర్యాప్తు తరువాత నేటికి ఆ కేసులో అరెస్టుల పర్వం మొదలయింది. ఇది ఎక్కడికి వరకు వెళుతుందో? దీనిలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకి వస్తాయో? చూడాలి.