చంద్రబాబుకి హైకోర్టులో ఊరట

ఓటుకి నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో ఊరట లభించింది. ఆ కేసులో తన పేరు చేర్చడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఆ కేసులో ఆయన పేరు చేర్చవలసిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఎసిబి కోర్టు ఆదేశాలని కొట్టివేసింది. హైకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడుకి చాలా ఉపశమనం కలిగించే విషయమేనని చెప్పవచ్చు. 

విశేషం ఏమిటంటే, ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని ఏపిలోని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ కేసులో ఎందుకు తలదూర్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఏదైనా కేసులో భాదితులు లేదా పిర్యాదు చేసినవారు కానీ వాదిస్తారు. మీరు ఎందుకు వాదిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో తలదూర్చిన మాజీ కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఇదే వర్తిస్తుందని చెపుతూ వారి పిటిషన్లని అనర్హమైనవిగా ప్రకటించి కొట్టివేసింది.