హైదరాబాద్ లో నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న 7అంతస్తుల భవనం గురువారం రాత్రి కూలిపోయింది. ఆ భవనంలో పనిచేస్తున్న 13-14 కుటుంబాలు ఆ శిధిలాలలో చిక్కుకొన్నారు. వారి సంఖ్య సుమారు 20 మంది వరకు ఉండవచ్చని సమాచారం. వారందరూ విజయనగరం జిల్లా, పొరుగున ఛత్తిస్ ఘర్ రాష్ట్రాల నుంచి వచ్చిపనిచేస్తున్న వారే.
ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడికి పోలీసులు, నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్, అగ్నిమాపక, వైద్య సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు. నిన్న రాత్రి నుంచి రెండు పొక్లెయిన్ యంత్రాలతో శిధిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. శివ అనే ఒక నాలుగేళ్ళ పిల్లాడిని, ఒక మహిళని శిధిలాల క్రింద నుంచి ప్రాణాలతో రక్షించగలిగారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, పోలీస్ కమీషనర్ స్నాదీప్ శాండిల్య తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని శిధిలాల తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలించారు.
ప్రత్యక్ష సాక్షుల చెప్పిన దాని ప్రకారం ఈ దుర్ఘటన నిన్న రాత్రి 9.10 గంటలకి జరిగినట్లు తెలుస్తోంది. భవనం కూలిపోయినప్పుడు దానిలో కొందరు విద్యార్ధులు కూడా ఉన్నట్లు చెపుతున్నారు. హైదరాబాద్ లో చదువుకోవడానికి వచ్చిన భవన కార్మికుల బందువుల పిల్లలై ఉండవచ్చని చెపుతున్నారు. కేవలం 360 గజాల స్థలంలోనే 6 అంతస్తులు, మళ్ళీ దానిపై ఒక పెంట్ హౌస్ కూడా నిర్మించినట్లు తెలిపారు.
టోలీచౌకి నివాసి అయిన తూల్జాపూర్ సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తు సింగ్ ఆ భవన యజమాని. అతను స్థానికంగా చాలా కాలంగా గుడుంబా వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై అనేకసార్లు పోలీసులు కేసులు నమోదు చేస్తే అతను కూడా మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించేవాడు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆ భవనం నిర్మాణం మొదలుపెట్టారు. కూలిపోయిన ఆ భవనానికి ఎటువంటి అనుమతులు లేవని సమాచారం.
ఘటనా స్థలం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రులు, మేయర్, అధికారులు తదితరులు యధాప్రకారం ఈ ఘటనకి భాద్యులైనవారు ఎంత పెద్ద వారైనా విడిచిపెట్టేది లేదని రంకెలు వేశారు. అయితే 360 గజాల స్థలంలో అంతపెద్ద భవనం అనుమతులు లేకుండా నిర్మించబడుతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోకపోవడం, ఇప్పుడు ఈ దారుణ ప్రమాదం జరిగిన తరువాత మంత్రులు రంకెలు వేయడం అన్నీ కూడా ఒక ‘రొటీన్ తంతు’గా మారిపోయాయి. కనీసం ఇప్పటికైనా ఇటువంటి అక్రమ నిర్మాణాలని చేపడుతున్న వారిపై, వారికి అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులపై, ఇటువంటి బారీ భవన నిర్మాణాలని పర్యవేక్షించని అధికారులపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఘోర ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.