పాత నోట్లు..కొత్త నిబంధనలు

నోట్ల రద్దు దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితులు సృష్టించిందనే విషయంలో బహుశః ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండవనే భావించవచ్చు. నోట్లరద్దు తదనంతర పరిణామాల గురించి ఇప్పుడు ఒక పెద్ద గ్రంధమే వ్రాయవచ్చు. ఇక ఈనెల రోజుల్లో కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు చాలా నిర్ణయాలే ప్రకటించింది. మిగిలిన ఈ మూడు వారాలలో ఇంకా ఎన్ని నిర్ణయాలు ప్రకటిస్తుందో ఎవరికీ తెలియదు. కానీ వాటన్నిటి గురించి వ్రాయాలన్నా కూడా మరో పుస్తకం తయారవుతుంది. కనుక ఈరోజు తాజా నిర్ణయాల గురించి తెలుసుకొని, మళ్ళీ రేపు ఏమని ప్రకటిస్తుందో చూసుకొంటే సరిపోతుంది. ఈరోజు తాజా నిర్ణయాలు ఏమిటంటే, 

1.డిశంబర్ 10 అర్దరాత్రి వరకు మాత్రమే పాత రూ. 500 నోట్లతో రైల్వే, మెట్రో రైల్వే టికెట్లు, బస్సు టికెట్లు కొనుగోలుకి అవకాశం. అ తరువాత ఆ నోట్లు స్వీకరించబడవు. అంటే 5 రోజులు గడువు కుదించిందన్నమాట!

2.నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహిస్తూ డెబిట్, క్రెడిట్ కార్డులపై పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేవారికి 0.75శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

3.ఆన్ లైన్ ద్వారా రైల్వే టికెట్స్ కొనుకోనేవారికి రూ.10లక్షల ఉచిత ప్రయాణ భీమా కల్పించబడుతుంది. నగదుపై టికెట్స్ కొనుగోలు చేసేవారికి ఉండదు.

4.రైల్వే క్యాటరింగ్, విశ్రాంతి గదుల బుకింగ్ కోసం అన్ లైన్ ద్వారా చెల్లించేవారికి 5శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

5.టోల్ గేట్స్ వద్ద డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేవారికి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

6.ఆన్ లైన్ ద్వారా ఎల్.ఐ.సి. ప్రీమియం చెల్లించేవారికి 8శాతం, సాధారణ భీమా పాలసీలకి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

7.దేశంలో లక్ష గ్రామాలకి స్వైపింగ్ మెషిన్లు త్వరలోనే పంపబడతాయి.