
మెట్రో రెండో దశ విస్తరణ పనులకు సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ ముగ్గురూ కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో నేడు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు 45 నిముషాలు వారు నలుగురూ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణ పనుల గురించి చర్చించారు. సిఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్ మెట్రో మొదటి దశ విలువ నిర్దారించడం, దానికి సంబంధించి ఎల్&టి కంపెనీ రుణాలు, ఆ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోని స్వాధీనం చేసుకోవడం, మెట్రో రెండో దశ పనులకు అవసరమైన నిధులు తదితర అంశాలపై అధ్యయనం చేసి తుది నివేదిక ఇచ్చే బాధ్యతని స్టేట్మెంట్ బ్యాన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ క్యాపిటల్’కు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కనుక ఆ నివేదిక చేతికి వస్తే హైదరాబాద్ మెట్రో స్వాధీనం, దాని కోసం ఏయే సంస్థల నుంచి ఎంత రుణం తీసుకోవాలి, రెండో దశ విస్తరణ పనులకు అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. ఈ ప్రక్రియ ముగియడానికి కనీసం రెండుమూడు నెలల సమయం పట్టవచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు మార్గం సుగమం అవుతుంది.
మూడు నాలుగు రోజుల క్రితం వరకు తెలంగాణా కాంగ్రెస్, బిజేపిల మద్య ఈ అంశంపై లేఖల యుద్ధం కొనసాగడంతో ఈ సమావేశాలలో సానుకూలంగా సాగుతాయా లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్, సిఎం రేవంత్ రెడ్డి నలుగురూ ఆ విమర్శలు పక్కన పెట్టి హైదరాబాద్ మెట్రోకి మార్గం సుగమం చేయడం చాలా అభినందనీయం.