నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి నేటి వరకు కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకి ఉపశమనం కలిగించే కొత్త కొత్త నిర్ణయాలు ప్రకటిస్తూనే ఉంది. త్వరలో మళ్ళీ మరొక నిర్ణయం ప్రకటించబోతోంది. నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడం కోసం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ.2,000 వరకు చేసే చెల్లింపులపై ఎటువంటి సర్వీస్ చార్జ్ వసూలు చేయరాదని నిర్ణయించింది. దానికి వీలుకల్పించేందుకు 2012 సర్వీస్ టాక్స్ నోటిఫికేషన్ లో మార్పులు చేయబోతోంది. బహుశః నేడో రేపో ఇది కూడా అమలులోకి తీసుకురావచ్చు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అందుకోసం బ్యాంకర్లపై ఒత్తిడి చేస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులని ప్రోత్సహించడం కోసం సర్వీస్ చార్జ్ రద్దు చేయడం లేదా నామత్రంగా వసూలు చేయాలని కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడానికి ఏపి పర్స్ యాప్ ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ లావాదేవీలకి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలని ప్రకటించడమే కాకుండా, బ్యాంకులని కూడా ప్రజలకి ప్రోత్సాహకాలు ఈయవలసిందిగా కోరుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా టీఎస్ వాలెట్ పేరుతో ఒక యాప్ ఏర్పాటు చేసి నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహిస్తోంది. సిద్ధిపేట శాసనసభ నియోజక వర్గంలో ప్రయోగాత్మకంగా ఈ నగదు రహిత లావాదేవీలని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయబోతోంది. ఇప్పటికే ప్రభుత్వోద్యోగులకి నగదు రహిత లావాదేవీలలో శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.