తెలంగాణా జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై చేస్తున్న విమర్శల ఘాటు క్రమంగా పెంచుతున్నట్లు కనబడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో భూనిర్వాసితులతో సమావేశం అయినప్పుడు తెరాస సర్కార్ వారి భూములని గూండా నయీంలాగ దౌర్జన్యంగా గుంజుకొంటోందని విమర్శించారు.
జనగామ జిల్లాలో గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలపాలని అక్కడి విద్యార్ధి జేయేసి గత రెండు నెలలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగా నిన్న అక్కడ మిలీనియం మార్చ్ జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై మళ్ళీ తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్దులని ఉద్దేశ్యించి ‘సన్నాసులు’ అని సంభోదిస్తుంటారు. ప్రొఫెసర్ కోదండరామ్ నిన్న అదే పదాన్ని తెరాస సర్కార్ పై ప్రయోగిస్తూ “ప్రజాభీష్టాన్ని పట్టించుకోని పాలకులు సన్నాసులలో కలుస్తారని,” తీవ్ర విమర్శలు చేశారు.
60 ఏళ్ళు పోరాటాలు చేసి తెలంగాణా సాధించుకొంటే, చివరికి మళ్ళీ రాచరిక పాలన ఏర్పడిందని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా, ప్రజాభీష్టానికి అనుగుణంగా చేయకుండా రాజులు రాజ్యాలని పంచుకోన్నట్లుగా నీకు ఈ జిల్లా నాకు ఆ జిల్లా..అన్నట్లు విభజించుకొన్నారని ప్రొఫెసర్ కోదండరామ్ అని ఎద్దేవా చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే విభజన జరిగినట్లయితే రెండు నెలలు అవుతున్నా ఇంకా ప్రజలు ఎందుకు ఈవిధంగా ఉద్యమాలు చేస్తున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ ని ప్రశ్నించారు.
ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నలకి, విమర్శలకి నేడో రేపో తెరాస సర్కార్ గట్టిగానే సమాధానం ఇస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ మళ్ళీ వేరే అంశం తీసుకొని తెరాస సర్కార్ పై ప్రతివిమర్శలు చేయవచ్చు. బహుశః వారి విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చే ఎన్నికల వరకు ఇలాగ కొనసాగుతూనే ఉండవచ్చు. రెండు వర్గాలు తమ అభిప్రాయలు, ప్రయత్నాలు సరైనవేనని భావిస్తున్నప్పుడు వారిలో ఎవరిది తప్పు అనే విషయం ప్రజలే తేల్చాలి.