ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలని నోట్ల రద్దు అంశం మింగేసిందని చెప్పకతప్పదు. నవంబర్ 16న సమావేశాలు మొదలైన రోజు నుంచి నేటి వరకు ప్రతిపక్షాలు అదే అంశంపై ప్రభుత్వంతో వాగ్వాదాలు చేస్తూ ఉభయ సభలని స్తంభింపజేస్తున్నాయి. మళ్ళీ ఈరోజు కూడా అలాగే జరగడంతో సీనియర్ సభ్యుడు లాల్ కృష్ణ అద్వానీ సహనం కోల్పోయి స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్య నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సభ జరుగుతున్న తీరు చూస్తుంటే స్పీకర్ కానీ మంత్రిగాని సభని సజావుగా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారనిపిస్తోంది. సభలో స్పీకర్ కంటే ప్రతిపక్షాలే ఎక్కువ పెత్తనం చలాయిస్తున్నాయి. కనీసం అవైనా సభ కార్యక్రమాలని నడిపించడానికి సహకరించడం లేదు. కేంద్రప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతోంది,” అని ఘాటుగా విమర్శించారు.
అప్పుడు సహాయ మంత్రి అనంత కుమార్ ఆయనకి నచ్చచెప్పబోతుంటే, “మళ్ళీ సభని ఎప్పటికి వాయిదా వేశారు?” అని అద్వానీ ప్రశ్నించారు. “రెండు గంటలకి” అని మంత్రి సమాధానం చెప్పినప్పుడు “అంతకంటే సభని నిరవధిక వాయిదా వేస్తే బాగుండేది కదా?” అని అద్వానీ అన్నారు. ఆయన సూచనకి మంత్రి షాక్ అయ్యారు. మళ్ళీ అద్వానీయే మాట్లాడుతూ “ఈవిధంగా సభలో నానా రభస చేస్తున్నప్పుడు సభని కొనసాగించడంలో అర్ధం లేదు. వీలైతే వాళ్ళతో రాజీ చేసుకోవాలి లేదా గొడవ చేస్తున్న వాళ్ళందరినీ బయటకి పంపించడం మంచిది. ఈ విధంగా సమావేశాలు నిర్వహించుకోవడమ మనకేమీ గౌరవం కాబోదు,” అని అన్నారు.