తెలంగాణా ఉద్యమ సమయంలో ప్రజలని, ఉద్యమకారులని పారా హుషార్ అంటూ తన పాటలతో ఉర్రూతలూగించి తెలంగాణా రాష్ట్ర సాధనకి కృషి చేసిన ప్రజా గాయని విమలక్క తనకి అన్యాయం జరిగిందంటూ ఈరోజు హైకోర్టుని ఆశ్రయించారు. ఆమె తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ (టీయూఎఫ్)లో సభ్యురాలు. అరుణోదయ సాంస్కృతిక మండలికి అధ్యక్షురాలు. అరుణోదయ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లో దోమలగూడాలో ఉంది.
ఆమె చట్ట వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారని టీయూఎఫ్ ప్రధాన కార్యదర్శి భరత్ పిర్యాదు చేయడంతో ఈనెల 2వ తేదీన పోలీసులు అరుణోదయ సాంస్కృతిక మండలి కార్యాలయానికి తాళం వేసి తమ అధీనంలో ఉంచుకొన్నారు. అందుకు విమలక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. త్వరలో మళ్ళీ మరోమారు ‘తెలంగాణా ధూం ధాం’ పేరిట ప్రజలలోకి వెళ్ళి తన ఆటపాటల ద్వారా తెరాస సర్కార్ చేస్తున్న ఇటువంటి పనులని ఎండగడతానని హెచ్చరించారు కూడా. కానీ తెరాస సర్కార్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆమె ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎటువంటి బలమైన కారణం చూపకుండానే తన కార్యాలయానికి తాళం వేశారని ఆమె ఆరోపించారు. తాను ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులని ఎత్తి చూపుతున్నందునే తెరాస సర్కార్ తనపై ఈవిధంగా కక్ష సాధింపు చర్యకి పాల్పడిందని విమలక్క ఆరోపించారు. కనుక తక్షణమే తన కార్యాలయాన్ని తెరిపించి దానిని తన స్వాధీనం చేయాలని ఆమె పిటిషన్ లో కోరారు.