రేపే ఎన్నికల ఫలితాలు... బెంగాల్, తమిళనాడులో ఎవరో?

అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం ఉదయం ఒకసారి మొదలవుతుంది.

అస్సోం, పుదుచ్చేరి, కేరళ ఫలితాల కంటే అందరి దృష్టి పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే ఉంది.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈసారి బిజేపి వస్తుందా లేక మమతా బెనర్జీయే అధికారంలోకి వస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ బిజేపి అంటున్నప్పటికీ, ఈసారి మరింత భారీ మెజార్టీతో మేమే అధికారంలో వస్తామనిమమతా బెనర్జీ నమ్మకంగా చెపుతున్నారు. 

తమిళనాడులో కూడా ఇటువంటి సందిగ్దతే నెలకొంది. అక్కడ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే గెలుస్తుందని కొన్ని సర్వేలు సూచిస్తే, బొటాబొటి మెజార్టీతో రావచ్చని లేదా ఇతర పార్టీల మద్దతు లభిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుచేయగలదని మరికొన్ని సూచిస్తున్నాయి.

రెండు సర్వేలు టివికే పార్టీ కనీసం 100కి పైగా సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా, మరో రెండు సంస్థలు టివికే పార్టీయే సొంత బలంతో లేదా మరో పార్టీ మద్దతుతో అధికారంలోకి వస్తుందని సూచిస్తున్నాయి. కనుక అన్ని పార్టీలు అప్పుడే తెర వెనక బేరసారాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

కేరళలో దశాబ్దాలుగా యూడీఎఫ్ (కాంగ్రెస్‌), ఎల్‌డీఎఫ్ (వామపక్షాలు) మద్యనే అధికార మార్పిడి జరుగుతుంది. ఆ ఆనవాయితీ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ స్థానంలో యూడీఎఫ్ అధికారంలోకి రాబోతోందని సర్వేలు సూచించాయి. 

అస్సోం, పుదుచ్చేరిలో బిజేపి గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు సూచించాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.