రేవంత్ బాణమే కవిత: ధర్మపురి అరవింద్

కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసుకోవడంపై రాష్ట్రంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లే, కాంగ్రెస్‌, బిజేపిలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. 

నిజామాబాద్‌ బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ నేడు మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి సంధించిన బాణమే కల్వకుంట్ల కవిత. కేసీఆర్‌, కేటీఆర్‌లని తాను తిట్టడం కంటే కల్వకుంట్ల కవిత చేత తిట్టిస్తే బాగుంటుందని ఆమె చేత పార్టీ పెట్టించాడు. కనుక ఆయన చెప్పినట్లుగానే ఆమె మాట్లాడుతోంది. కానీ రాజకీయాలలో రాణించాలనుకునేవారు ఈవిధంగా వ్యవహరిస్తే విశ్వసనీయత కోల్పోతారని ఆమె గ్రహిస్తే మంచిది,” అని అన్నారు. 

ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత కూడా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాడు ఎన్టీఆర్, కేసీఆర్‌ పార్టీలు పెట్టినప్పుడు ఇలాంటి ఆటుపోట్లు, అవమానాలే ఎదుర్కొన్నారు. కానీ చివరికి వారే రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగారు. పార్టీ పెట్టిన వెంటనే ఎవరూ ఆ స్థాయికి ఎదిగిపోలేరు.

నేను కూడా అలాగే ఆటుపోట్లు తట్టుకొని ముఖ్యమంత్రినవుతా. రాష్ట్రం అన్ని వర్గాల వారిని అమ్మలా లాలించి అందరికీ సమానావకాశాలు కల్పిస్తాను. కనుక నా గురించి, నా పార్టీ గురించి ఎవరెవరో నోటికొచ్చిన్నట్లు మాట్లాడినా పట్టించుకోను. నా లక్ష్యం సాధించేవరకు ముందుకే సాగుతాను,” అని అన్నారు.