నేడు డిల్లీకి కేసీఆర్..మళ్ళీ అందుకేనా?

ముఖ్యమంత్రి కేసీఆర్ బుదవారం రాత్రి డిల్లీ వెళతారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కుమార్తె వివాహ రెసిప్షన్ పార్టీ రేపు డిల్లీలో జరుగనుంది. దానికి హాజరయ్యేందుకు కేసీఆర్ డిల్లీ వెళుతున్నారు. ఆ తరువాత ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. 

నోట్ల రద్దు తదనంతర పరిణామాల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో ఒకసారి చర్చించారు. మళ్ళీ రేపు కూడా అదే విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు కారణంగా రాష్ట్రానికి ఏర్పడుతున్న ఆర్ధిక లోటు గురించి ప్రధానికి వివరించి కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం కోరవచ్చు. అలాగే నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కేంద్రప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించినప్పటికీ, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో, కేంద్రమంత్రులతో చాలా బలమైన సత్సంబందాలు నెలకొల్పుకొని రాష్ట్రానికి కావలసినవన్నీ సాధించుకొంటున్నారు. అంతే గాక నోట్ల రద్దు వంటి సమస్యలని అధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోడీకి సలహాలు ఇచ్చేంత సానిహిత్యం పొందడం విశేషం. కనుక ఆయన డిల్లీ బయలుదేరితే ప్రధాని మోడీకి ఏమైనా కొత్త సలహాలు ఇవ్వబోతున్నారా? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.