ఈ చట్టం గిగ్ వర్కర్లకు గొప్ప వరమే

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4.5 లక్షల గిగ్ వర్కర్లకు ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చింది. వారి ఉద్యోగాలకు, జీతాలకు, జీవితాలకు భద్రత, భరోసా కల్పించే తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లుకి నేడు తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు.

కనుక ఒకటి రెండు రోజులలో గెజిట్ నోటిఫికేషన్‌ వెలువడగానే ఈ చట్టం అమలులోకి వస్తుంది. అప్పటి నుంచి ‘ప్రొటక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్’ చట్టం ప్రకారం గిగ్ వర్కర్లు ఉద్యోగ భద్రత, జీతాలు, భీమా వంటి అన్ని అంశాలు రాష్ట్ర కార్మిక శాఖ పర్యవేక్షిస్తుంది. 

దేశంలో ఊబార్, ఓలా, ర్యాపిడో వంటి రవాణా సంస్థలలో పని చేసే డ్రైవర్లు, హోటల్స్‌, రెస్టారెంట్స్ నుంచి ఆహార పదార్ధాలు మొదలు నిత్యావసర సరుకులు, పళ్ళు, కూరగాయలు ఇళ్ళకు డెలివరీ చేసే స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలలో పనిచేసే డెలివరీ బాయ్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ తదితర ఈ కామర్స్ సంస్థల ఉత్పత్తులను ఇళ్ళకు డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ గిగ్ వర్కర్లుగా పరిగణింపబడతారు. 

ఏ మాత్రం ఉద్యోగ భద్రత, కుటుంబ పోషణకి సరిపడే జీతం లేకుండా రోజంతా వాహనంపై రోడ్లపై తిరిగే గిగ్ వర్కర్ల జీతాలు, జీవితాలు దేనికీ భద్రత లేదు. కానీ ఈ చట్టం ద్వారా వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, భీమా వగైరా అన్ని అమలు చేయాల్సి ఉంటుంది. దేశంలో రాజస్థాన్ తర్వాత తెలంగాణలోనే గిగ్ వర్కర్ల కోసం ఈ చట్టం వచ్చింది.