సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ ఈరోజు నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ జనవరి 3న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజే అంటే జనవరి 4న జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఆయన పదవి కాలం కేవలం 7నెలలే. ఆగస్ట్ 4, 2017లో ఆయన పదవీ కాలం ముగుస్తుంది.
జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ ఆగస్ట్ 28, 1952లో పంజాబ్ లో జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ గతంలో 2009-2010వరకు ఉత్తరాఖండ్ హైకోర్టుకి, ఆ తరువాత కర్నాటక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వ్యహరించారు. సెప్టెంబర్ 2011 నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన బి. లౌకుర్ లు సభ్యులుగా కలిగిన సుప్రీంకోర్టు కొలీజియంకి నేతృత్వం వహిస్తారు.