తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంతిమ సంస్కారాలు ఈరోజు సాయంత్రం చెన్నై మెరీనా బీచ్ లో లక్షలాది ప్రజలు ఆ రాష్ట్ర ఇన్-ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, అనేకమంది రాజకీయ నేతల సమక్షంలో సకల అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆమె కోరుకొన్నట్లుగానే ఆమె స్నేహితురాలు వైష్ణవాచారాల ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆమె రాజకీయ గురువు ఎంజిఆర్ సమాధికి దగ్గరలోనే ఆమెని ఖననం చేశారు. నిన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ సెల్వంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ ఆమె అంత్యక్రియలకి హాజరయ్యారు.
నేటితో తమిళనాట అమ్మ శకం ముగిసిపోయింది. అమ్మకి వీర విధేయుడైన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆమె చూపిన బాటలోనే పయనిస్తూ రాష్ట్ర ప్రజలని ఆమె లేని లోటు మరపిస్తారో లేదో చూడాలి. అయితే ఆయనతో సహా అధికార అన్నాడిఎంకె పార్టీలో కానీ ప్రభుత్వంలో గానీ అంతటి అపూర్వమైన ప్రజాకర్షణ గల నేత మరొకరు లేరు. ప్రధాన ప్రతిపక్ష నేత కరుణానిధికి ఇంచుమించు అంతటి ప్రజాకర్షక శక్తి ఉంది కానీ ఆయనకి వయసు మీరిపోయి తరచూ వృదాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కనుక జయలలిత అంతటి ప్రజాకర్షణ, ప్రజాధారణ కలిగిన నేత ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఉద్భవిస్తాడో తెలియదు కానీ ఆలోగా తమిళనాట రాజకీయాలు ఇక నుంచి కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది.