అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్ కోదండ రామ్‌, మహ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియామకాలకు సంబంధించి ఫైలుపై నేడు తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లా సంతకం చేశారు. ఈమేరకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్‌ వెలువడుతుంది. 

ఇది ముఖ్యంగా మంత్రి అజారుద్దీన్‌కి చాలా ఉపశమనం కలిగిస్తుంది. రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా ఉభయ సభలలో ఏదో ఒకదానికి తప్పనిసరిగా ఎన్నికవవలసి ఉంటుంది. ఈ నెలాఖరుకి ఆ ఆరు నెలల గడువు ముగుస్తుంది. ఒకవేళ గవర్నర్‌ ఆలోగా ఆమోదం తెలుపకపోతే అజారుద్దీన్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 

ఇటీవల సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిపినప్పుడు గవర్నర్‌కు జూలై వరకు గడువు ఇచ్చింది, కనుక గవర్నర్‌ ఇప్పుడే వారిని నామినేట్ చేయకూడదనుకుంటే అజారుద్దీన్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. కానీ ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లాని కలిసి పరిస్థితి వివరించి అభ్యర్ధించడంతో నేడు ఫైలుపై సంతకం చేశారు. కనుక అజారుద్దీన్‌ మంత్రి పదవికి ఇంకా డోకా లేనట్లే!