పార్టీ ఆవిష్కరణ సభకు బయలుదేరిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు ఉదయం బంజారా హిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్ధనలు చేసిన తర్వాత కార్ ర్యాలీతో అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరారు.

అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, మునీరాబాద్‌లోని అద్వయ ఫంక్షన్ హాలులో జరిగే పార్టీ అవిష్కరణ సభకు చేరుకుంటారు.

ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, డా.అంబేద్కర్, జ్యోతీరావు పూలే, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి తర్వాత వేదికపైకి వస్తారు. పార్టీ ప్రకటనకు ఉదయం 10గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. కనుక ఆలోగా కళా ప్రదర్శనలు, నేతల ప్రసంగాలు ఉంటాయి. 

పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించిన తర్వాత కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై ప్రసంగిస్తారు. దానిలో భాగంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించడం ఖాయం. ముఖ్యంగా బీఆర్ఎస్‌ పార్టీని టార్గెట్ చేసుకొని ఆమె చేయబోయే విమర్శలపై ఇకనైనా ఆ పార్టీ నేతలు స్పందిస్తే రెండు పార్టీల మద్య యుద్ధాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. 

పార్టీ ఆవిష్కరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తల కోసం 32 రకాల తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు.