కేసీఆర్‌ని విమర్శిస్తుంటే సమాధానం ఇలాగా?

దేశాన్నే ఏలాలనుకున్నారు కేసీఆర్‌. అలాంటి కేసీఆర్‌ని ఆత్మలేని మర మనిషి, అయన నిరంకుశ పాలన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత విమర్శిస్తుంటే, ఆమె సోదరుడు కేటీఆర్‌ వెంటనే సమాధానం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. 

కానీ బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆచితూచి స్పందించాలి తప్ప హడావుడిగా మాటకు మాట అప్పజెప్పడం వలన మరిన్ని కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. కనుక పార్టీలో ముఖ్య నేతలతో అన్ని అంశాలపై చర్చించిన తర్వాత తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి పార్టీ తరపున స్పందించవచ్చు. రాజకీయాలలో అదే సరైన విధానం. 

కానీ ఈలోగా బీఆర్ఎస్‌ పార్టీ తరపున సోషల్ మీడియాలో స్పందన ఆ పార్టీ స్థాయికి తగినట్లు లేదు. చాలా పేలవంగా ఉంది. ఒరిజినల్ ఒరిజినలే అంటూ కోల్గేట్ టూత్ పేస్ట్, బిస్లిరీ వాటర్ బాటిల్ బొమ్మలు, వాటి పక్కనే పేరులో అక్షరాల మార్పుతో వాటి నకిలీ ఉత్పత్తులను పోస్ట్ చేసింది. 

ఆమె పార్టీ ప్రకటించబోయే 5 రోజుల ముందు అంటే ఈ నెల 20న జగిత్యాల సభలో కేసీఆర్‌ తప్పకుండా కూతురు రాజకీయాల గురించి మాట్లాడుతారని అందరూ ఆశించారు. కానీ ఆమె ఊసే ఎత్తలేదు.

కేసీఆర్‌ అంతటివాడు ఆమె విషయంలో ఏవిధంగా స్పందించాలో తెలియక తికమకపడుతున్నప్పుడు, కేటీఆర్‌ స్పందించడం ఇంకా కష్టమే. ముఖ్యంగా సొంత చెల్లి కావడంతో ఆమె ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా ఆచితూచి మాట్లాడాల్సివస్తోంది.

ఆమె గురించి తప్పుగా మాట్లాడితే ఆమెకు ప్రజల సానుభూతి లభిస్తుంది. బీఆర్ఎస్‌ పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. 

కనుక ఇక నుంచి కేటీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ నేతలకు రోజూ ఆమె ఇలా వాతలు పెడుతూనే ఉంటారు. భరిస్తూ మౌనంగా ఉండిపోతారో లేదా ఆమెని రాజకీయ ప్రత్యర్ధిగా పరిగణించి ఎదురుదాడి చేస్తారో? కానీ ఎలా వ్యవహరించినా నష్టం బీఆర్ఎస్‌ పార్టీకే!