రాష్ట్రం తరపున హరీష్, నాయిని చెన్నైకి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రద్దాంజలి ఘటించి ఆమె అంత్యక్రియలకి హాజరయ్యేందుకు రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి కొద్దిసేపటి క్రితం చెన్నై బయలుదేరారు. ఇప్పటికే చెన్నైలోని రజనీకాంత్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు అమ్మని సందర్శించుకొని నివాళులు తెలిపారు. వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు చెన్నై చేరుకొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొద్ది సేపటి క్రితమే చెన్నై చేరుకొని, రాజాజీ హాల్లో ఉంచిన ఆమె పార్ధివ శరీరాన్ని దర్శించుకొని నివాళులు అర్పించబోతున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆమె అంత్యక్రియలకి హాజరైన తరువాత మళ్ళీ డిల్లీకి తిరిగి వెళతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమె అంత్యక్రియలకి హాజరయ్యేందుకు డిల్లీ నుంచి వాయుసేనకి చెందిన ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరారు కానీ ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆయన వేరే విమానంలో మళ్ళీ చెన్నైకి బయలుదేరారు.