తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత వ్యక్తిత్వం, ఆమె వ్యక్తిగత, రాజకీయ, సినీ జీవితంలో ఎత్తుపల్లాలు అన్నీ కూడా అందరికీ తెలిసినవే. ఎందుకంటే ఆమె జీవితం ఒక తెరిచి ఉంచిన పుస్తకం వంటిది. ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు, సవాళ్ళు, సుఖదుఃఖాలు, ఎత్తుపల్లాలు ఉంటాయి కానీ ఆమె జీవితంలో మాత్రం ప్రతీది కొంచెం ఎక్కువగానే జరగడం విశేషం. ఆమె జీవిత చరిత్రని వ్రాయదలచుకొన్నవారు ఆమె వ్యక్తిత్వం గురించె ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని, సినీ, రాజకీయ ప్రస్థానాల గురించి వేర్వేరుగా పుస్తకాలు వ్రాయవలసి ఉంటుంది. మళ్ళీ ఆమె తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రస్థానం గురించి వేర్వేరుగా పుస్తకాలు వ్రాయవలసి ఉంటుంది. వాటన్నిటినీ కలిపితేనే ఆమె జీవిత చరిత్ర అవుతుంది. సముద్రమంత విశాలమైన జీవిత చరిత్ర ఆమెది. దానిని ఒక పుస్తకంలోనే ఇమడ్చలేనప్పుడు ఇక్కడ కొన్ని పేరాలలో ఇమడ్చడం అసంభవమే. కానీ కొండని అద్దంలో చూపే ప్రయత్నం చేసినట్లుగా ఆమె జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలియజేస్తున్నాం.
ఆమె తల్లి తండ్రుల పేర్లు జయరాం, వేదవల్లి (సంధ్య) తల్లి సినీ నటి. వారికి 1948, ఫిబ్రవరి 24న మైసూర్ రాష్ట్రంలోని మెల్కోటేలో జయలలిత జన్మించింది. ఆమె పుట్టిన రెండేళ్ళకే తండ్రి జయరామ్ మృతి చెందారు. ఆమె జీవితంలో అప్పటి నుంచి మొదలయిన విషాద సంఘటనలు, చేదు అనుభవాలు కడదాకా కొనగుతూనే ఉన్నాయి.
అంత పసిప్రాయంలో ఆమెని తన తల్లి తండ్రులవద్ద విడిచిపెట్టి ఆమె తల్లి సంధ్య మద్రాస్ వెళ్లిపోయింది. ఎనిమిదేళ్ళ వయసు వచ్చే వరకు జయలలిత తాతగారి ఇంట్లోనే పెరిగింది. అంటే పసితనంలో తల్లి ప్రేమ తెలియకుండానే పెరిగిందన్నమాట. తరువాత 1958లో మద్రాసులో తల్లి వద్దకి వచ్చింది. కానీ అప్పుడూ ఆమెకి పూర్తిగా తల్లి ప్రేమ దొరకలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె తల్లి సినిమాలలో నటిస్తూ తీరికలేని జీవితం గడిపేవారు. ఆమె నటించడమే కాకుండా కూతురుని కూడా 1961 లో కన్నడ సినిమాలో బాలనటిగా పరిచయం చేయడంతో జయలలితకి మధురమైన బాల్యజీవితం కూడా కోల్పోయిందనే చెప్పవచ్చు.
మూడేళ్ళ తరువాత అంటే 1964 లో ‘చిన్నాడ గోంబే’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆమె కూడా సినీ పరిశ్రమలో తీరికలేని జీవితం గడుపుతూ ఆమె యవ్వనదశలో కూడా ఎటువంటి సుఖసంతోషాలు లేకుండానే జీవించారని చెప్పవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల ద్వారా ఎనలేని కీర్తిప్రతిష్టలు, అనేక పురస్కారాలు అందుకొన్నప్పటికీ అవేవీ ఆమె కోరుకొన్న సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేకపోయాయనే చెప్పవచ్చు. ఒక మహిళగా ఆమె వ్యక్తిగత జీవితం అసంపూర్ణంగానే ఉండిపోయింది. ఆమె కొంతమందికి దగ్గరకావాలనుకొంటే, అనేకమంది ఆమెకి దగ్గర కావాలని ఆమెతో జీవితం పంచుకోవాలనుకొన్నారు. కానీ ఆ ప్రయత్నాలలో కూడా ఆమెకి ఎదురైన అనేక చేదు అనుభవాల కారణంగా ఆమె జీవితాంతం వివాహం చేసుకోకుండానే ఉండిపోయారు.
ఇక ఆ తరువాత రాజకీయ జీవితం అయినా సజావుగా సాగిందా అంటే అదీ లేదు. ఆమె తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకొని, దానిని సమున్నత శిఖరాలపై నిలిపి ఉంచుకోవడానికి ఆమె జీవితాంతం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మనదేశంలో ఏ రాజకీయ నాయకుడు బహుశః ఆమె ఎదుర్కొనన్ని తీవ్రమైన ఒడిదుడుకులని, సవాళ్ళని ఎదుర్కొనలేదంటే అతిశయోక్తి కాదు. ఆమె రాజకీయ జీవితం గురించి వ్రాయాలంటే అదొక మహా గ్రంధమే అవుతుంది.
ఆమె చేసిన అవిశ్రాంతమైన పోరాటాల వలననే ఆమె రాష్ట్రంలో అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవిలో చిరకాలం కొనసాగగలిగారు. చివరికి ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నప్పటికీ ఎవరూ కూడా ఆమె అధికారాన్ని సవాలు చేసి దక్కించుకొనే సాహసం చేయలేకపోయారంటే ఆమె గొప్పదనం అర్ధం అవుతుంది.
చివరికి ఆమె మృత్యువుతో కూడా పోరాడవలసి రావడం మరీ విచిత్రమైన విషయమే. సుమారు రెండు నెలల పాటు మృత్యువుతో కూడా పోరాడి అక్కడ కూడా గెలిచారు కానీ భగవంతుడు అక్కడ కూడా ఆమెని గెలవనీయకుండా అకస్మాత్తుగా తీసుకుపోయాడు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏకధాటిగా పోరాడిన మహా పోరాట యోదురాలు జయలలిత అని చెప్పక తప్పదు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రజల తరపున మైతెలంగాణా.కాం ఆ భగవంతుడిని కోరుకొంటోంది.