జయ వారసుడిగా పన్నీర్ సెల్వం?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి ప్రకటించిన వెంటనే, అధికార అన్నాడిఎంకె పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అత్యవసరంగా ఆసుపత్రిలోనే సమావేశం అయ్యారు. ఆ సమావేశంలోల జయలలిత వారసుడిగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి మరియు ప్రస్తుతం తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ. పన్నీర్ సెల్వంని ఎన్నుకొన్నట్లు తాజా సమాచారం. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఒక తీర్మానం ఆమోదించినట్లు తెలుస్తోంది.


కానీ జయలలిత స్నేహితురాలు శశికళ ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “అమ్మకి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతున్నట్లు నాకు అనుమానం కలుగుతోంది. అధికారం కోసం అర్రులు చాస్తున్న కొంతమంది ఈ కుట్రకి పాల్పడుతున్నట్లు నాకు అనుమానాలు ఉన్నాయి. వీలైతే అమ్మని  డిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి గానీ లేదా విదేశాలకి గానీ తరలించి చికిత్స చేయించాలి,” అని ఆమె డిమాండ్ చేశారు. అంటే అపోలో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యంపై కూడా ఆమెకి నమ్మకం లేదని, ఆమె కోలుకోకుండా ఆసుపత్రిలోనే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. 

ఏమైనప్పటికీ, ఒకవేళ జయలలిత కోలుకోలేకపోయినట్లయితే, అన్నాడిఎంకె పార్టీలో కలిసికట్టుగా నిలబడగలదా లేదా? నిలబడగలిగినా ఆ పార్టీలో ఆమెకున్న ప్రజాధారణ, ఎమ్మెల్యేల మద్దతు పన్నీర్ సెల్వంతో సహా మరెవరికీ లేనందున, ఆయన నాయకత్వంలో పార్టీ ఎంత కాలం చీలిపోకుండా ఉండగలదు? అనే అనుమానాలు ఉన్నాయి.