కవిత కొత్త పార్టీ పని త్వరగా ముగించండి: ఢిల్లీ హైకోర్టు

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు దరఖాస్తు చేసుకోగా దానిలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ వెనక్కు తిప్పి పంపింది. ఆ లోపాలు సరిదిద్ది మళ్ళీ సమర్పిస్తే పోయేదానికి ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గత నెల దానిపై విచారణ చేపట్టినప్పుడు ఈసీ న్యాయవాది ఇదే విషయం చెప్పి దరఖాస్తులో తప్పులు సరిదిద్ది తిరిగి సమర్పించాలని సూచించామని హైకోర్టుకి తెలిపారు. ఈరోజు విచారణ చేపట్టినప్పుడు, కల్వకుంట్ల కవిత తరపు న్యాయవాది కూడా అదే చెప్పారు. ఈసీ సూచించినట్లు దరఖాస్తులో తప్పులు సరిదిద్ది సమర్పించామని హైకోర్టుకి తెలిపారు. కనుక వీలైనంత త్వరగా ఆమె పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని ఢిల్లీ హైకోర్టు ఈసీని ఆదేశించింది. కల్వకుంట్ల కవిత హైకోర్టుకి వెళ్ళకపోయినా ఇదే జరిగేది కదా?