
కేంద్ర ఎన్నికల కమీషన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి నేడు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది.
ఇప్పటికే ఈ నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసింది. కేంద్ర ఎన్నికల కమీషన్ సభ్యులు ఆయా రాష్ట్రాలలో పర్యటించి ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలతో ఎన్నికల నిర్వహణ గురించి చర్చించారు.
నాలుగు రాష్ట్రాలలో అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో అప్పుడే పర్యటిస్తున్నారు కూడా.
ఈసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని బిజేపి అధిష్టానం చాలా పట్టుదలగా ప్రయత్నాలు చేస్తోంది. సిఎం మమతా బెనర్జీ తప్పుకునే సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ చెప్పేశారు. కనుక ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో గెలిచేందుకు బిజేపి సర్వశక్తులు ఒడ్డి పోరాడబోతోంది.
తమిళనాడులో ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా, అన్నాడీఎంకే-బిజేపి కూటమి ప్రతిపక్షంలో ఉంది. కనుక ఇటీవల టీవీకే పార్టీతో రాజకీయాలలోకి వచ్చిన కోలీవుడ్ నటుడు విజయ్‌తో పొత్తులకు బిజేపి అధిష్టానం చాలా రకాలుగా ప్రయత్నించింది. కానీ ఆయన ఒంటరిగానే పోరాడాలని నిశ్చయించుకున్నారు.
తాజాగా జయలలిత స్నేహితురాలు శశికళ కూడా కొత్త పార్టీతో వచ్చారు. కనుక ఈసారి తమిళనాడు ఎన్నికలలో అన్ని పార్టీల మద్య ఓట్లు చీలితే హాంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.