తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆమెకి వైద్యం అందిస్తున్న అపోలో ఆసుపత్రి కొద్దిసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన చేసింది. దానిలో ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలిపింది. ఆమెకి యంత్రాల సహాయంతో ఉపశమనం కలిగిస్తున్నామని, నిపుణులైన వైద్యులు ఆమెకి చికిత్స అందిస్తున్నారని ప్రకటనలో పేర్కొంది.
గుండెకి, మళ్ళీ దాని నుంచి అవయాలకి రక్తం ప్రవహిస్తున్నప్పుడు దానిలో తగినంత ఆక్సిజన్ ఉండాలి. ఆ పని ఊపిరితిత్తులు చేస్తుంటాయి. ఆమెకి ఇటీవలే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకి దాని నుంచి అతి కష్టం మీద బయటపడిన సంగతి తెలిసిందే. కనుక ఆమెకి నిన్న గుండెపోటు వచ్చినప్పటి నుంచి ఎక్స్ ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్ (ఎక్మో) అనే యంత్రం ద్వారానే గుండె, ఊపిరితిత్తులు రెండూ చేసే పనులని నిర్వహిస్తున్నారు. అవి కాక లైఫ్ సపోర్టింగ్ పరికరాలని కూడా వినియోగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కనుక ఆమె పరిస్థితి చాలా విషమంగానే ఉన్నట్లు చెప్పారు.
ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి అపోలో ఆసుపత్రి వద్ద, నగరంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నిన్నటి నుంచి ఆసుపత్రి గేట్ల ముందు పడిగాపులు కాస్తున్న ఆమె మహిళాభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ గంభీర వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా స్థాయి వరకు రాష్ట్రం అంతటా బారీగా పోలీసులని, భద్రతాదళాలని ప్రభుత్వం మొహరించింది. అపోలో ఆసుపత్రి వద్దే 3000 మంది పోలీసులని మొహరించబడ్డారు.
అధికార అన్నాడిఎంకె పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కొద్ది సేపటి క్రితం అపోలో ఆసుపత్రిలోనే సమావేశమయ్యి ఈ క్లిష్ట పరిస్థితులలో అందరూ ఐకమత్యంగానిలబడి ప్రభుత్వానికి, ప్రజలకి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.