ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధరాదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం విమానంలో తిరుపతి వచ్చారు. ఆమె బ్యాగులో రూ.10 లక్షలు విలువ చేసే రూ.500,1,000 పాత నోట్లు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి, ఆమెని ప్రశ్నించగా వాటిని తిరుపతి వెంకన్న హుండీలో వేయడానికి తీసుకువెళుతున్నానని చెప్పారు. ఆ డబ్బుకి చెల్లించిన ఆదాయపన్ను రశీదులని ఆమె అధికారులకి చూపించడంతో వారు ఆమెని విడిచి పెట్టారు.
బాలకృష్ణ కుటుంబం ధనిక కుటుంబం అని అందరికీ తెలిసిందే. కనుక ఆమె వద్ద రూ.10 లక్షలు ఉండటం పెద్ద విశేషం కాదనే చెప్పవచ్చు. దేవాలయాలలో ఈవిధంగా జమా అవుతున్న పాతనోట్లని బ్యాంకులు ఇంకా స్వీకరిస్తున్నందున ఆమె వేసిన నోట్లు చెల్లుబాటు అవుతాయి. అది వేరే సంగతి. కానీ పాత నోట్ల రద్దు తరువాత ఒకేసారి అంత బారీగా పాతనోట్లని హుండీలో వేయడమే అనుమానాలకి తావిస్తోంది. డిశంబర్ నెలాఖరుతో పాతనోట్లకి ఆయువు తీరిపోతున్నందున దేశంలో నల్లధనం ఉన్నవారు దానిని వదిలించుకోవడానికి ఈవిధంగా దేవాలయాలలో హుండీలలో బారీగా పాత నోట్లు వేస్తున్నారు. బాలకృష్ణ అర్ధాంగి కూడా వారి బాటలోనే నడవడమే అనుమానాలకి తావిస్తోంది. అదే ఆమె ఆ నోట్లని మార్చి కొత్త నోట్లని దేవుడి హుండీలో వేస్తే ఎవరూ ఆమెని వేలెత్తి చూపగలిగేవారు కాదు కదా?