చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు

చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నిన్న సాయంత్రం గుండెపోటు రావడంతో వైద్యులు ఆమెకి అత్యవసర చికిత్స చేస్తున్నారు. ఆమెకి గుండెపోటు వచ్చినట్లు దృవీకరించారు కానీ ఇప్పటి వరకు ఆమె  ఆరోగ్యపరిస్థితి గురించి ఆసుపత్రి వర్గాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్రమంతటా మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

ఆమె ఆరోగ్యపరిస్థితి మళ్ళీ విషమించిందనే వార్త కార్చిచ్చులాగా క్షణాలలో రాష్ట్రం అంతటా వ్యాపించడంతో చెన్నై, దాని చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలు, ఆమె అభిమానులు బారీగా అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. వారిని నియంత్రించడానికి అపోలో ఆసుపత్రి చుట్టూ బారీగా పోలీస్ బలగాలని మోహరించవలసి వచ్చింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఈరోజు విద్యాసంస్థలు, అనేక ప్రైవేట్ సంస్థలు, హోటళ్ళు, దుఖాణాలు, పెట్రోల్ బంకులు మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి బారీగా సి.ఆర్.పి.ఎఫ్.బలగాలని పంపించింది. 

ఆమెకి గుండెపోటు వచ్చిన సంగతి తెలియగానే తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి నిన్న రాత్రే చెన్నై చేరుకొని ఆసుపత్రికి వెళ్ళి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులని అడిగి తెలుసుకొన్నారు. ఆ తరువాత ఆయన రాజ్ భవన్ లో రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయన ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి, రాష్ట్రంలో పరిస్థితుల గురించి తెలుసుకొంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో, ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా బారీగా పోలీసులని, భద్రతాదళాలని మొహరిస్తున్నారు.