బోరబండ ఇక పీజేఆర్‌ బోరబండ: సిఎం రేవంత్

సిఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండ వద్ద ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇక్కడ స్వర్గీయ పి. జనార్ధన్ రెడ్డి అభిమానులు చాలా మంది ఉన్నారని నాకు తెలిసింది.

ఒకప్పుడు ఆయన వారందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పించారు. కనుక బోరబండ చౌరస్తాకు అయన పేరు పెట్టాలని కోరుతున్నారు. ఈ చౌరస్తాకు ఆయన పేరు పెట్టడమే కాదు... చౌరస్తాలో అయన విగ్రహం కూడా పెట్టుకుందాము. ఈ ఉప ఎన్నికలలో విజయం సాధించగానే నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. విగ్రహం ఏర్పాటు చేయిస్తా,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పిజేఆర్ కుమారుడు పి నవీన్ యాదవ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయనని ప్రజలకు పరిచయం చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే, ఆ తర్వాత వారు కనబడకుండా మాయం అవుతారని, అలాంటి పార్టీకి ఓట్లు వేసి వృధా చేసుకోవద్దని, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్ధి నవీన్ యాదవ్‌కి ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.