గత రెండు నెలలుగ చెన్నై
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం
సాయంత్రం సుమారు 6గంటలకి గుండెపోటు రావడంతో ఆమెని వెంటనే ప్రత్యేక వార్డు నుంచి
మళ్ళీ ఐ.సి.యు.లోకి తరలించి వైద్యులు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమెకి
ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు డిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి కార్డియాలజిస్టులు
కూడా చెన్నై చేరుకొన్నారు. ప్రస్తుతం ఆమెకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె
ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ప్రకటన వెలువడవలసి ఉంది.
ఆమెని సెప్టెంబర్
22వ తేదీన చెన్నైలో చేర్చారు. లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె ప్రాణానికే ప్రమాదం
ఏర్పడినప్పుడు లండన్ కి చెందిన డా. పీలే, సింగపూర్, డిల్లీలోని ఎయిమ్స్ వైద్య
నిపుణులు అందరూ కలిసి ఆమె ప్రాణాలని కాపాడారు. ఆమె పూర్తిగా కోలుకొన్నప్పటికీ, ఆసుపత్రిలోనే
ఉంటూ ఫిజియోథెరపీ చేయించుకొంటున్నారు. అదే ఇప్పుడు ఆమెకి వరంగా
మారింది. ఆమె నిరంతరం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండటంతో ఆమెకి గుండెపోటు
రాగానే తక్షణం అత్యవసర వైద్య చికిత్స అందించగలిగారు.
ఆమెకి గుండెపోటు
వచ్చినట్లు తెలియగానే రాష్ట్ర మంత్రులు, అన్నాడిఎంకె పార్టీ నేతలు, ఆమె అభిమానులు ఆసుపత్రికి
తరలివస్తున్నారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకొన్నారు. ఆమె
ఆరోగ్యపరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ రాష్ట్ర ఇన్-చార్జ్
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు.